టీడీపీది దుర్మార్గ సంస్కృతి
కావలి: అధికారం చేతిలో ఉందని కావలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దుర్మార్గ సంస్కృతికి తెర తీశారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దా ష్టీకానికి కావలి సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాసులురెడ్డిపై టీడీపీ గూండాలు కాపు కాచి దాడి చేయడంతోపాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన తర్వాత మరోసారి అతనిపై, తోడుగా వచ్చిన అట్ల రాజా, వెంకటేశ్వర్లు, పులి శ్రీహరిపై కత్తులతో దాడి చేసిన విషయం రాష్ట్రమంతా చూసిందన్నారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి 20 రోజులుగా సబ్‌జైల్లో ఉంచడం దారుణమన్నారు. అధికారులు అధికార పార్టీ నాయకుల మాటలు విని తప్పుడు కేసులు పెడితే ఆ ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాల్జేయడం సరికాదన్నారు.
రైతుల కడుపుకొడుతున్నారు..
నియోజకవర్గంలో అభివృద్ధి లేదు.. ఉపాధి లేదు.. మరో వైపు రైతుల కడుపుకొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందంచకపోవడంతో దిగుబడులు కూడా భారీగా తగ్గాయి. పంటలకు కనీస మద్దతు ధర లేదని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మచ్చుకు కూడా కనిపించడం లేదన్నారు. తీరంలో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతోనే పూర్తయ్యాయన్నారు. వీటి అనుబంధంగా పరిశ్రమలకు సంబంధించి భూములకు అప్పట్లో ఎకరాకు ప్రభుత్వం రూ.30 లక్షల పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కాగా, టీడీపీ అధికారంలోకి వస్తే రూ.50 లక్షలు ఇస్తామని మభ్య పెట్టిన టీటీపీ నాయకులు ప్రస్తుతం రూ.11 లక్షలే ఇస్తామని ప్రకటించి బలవంతపు భూసేకరణకు పాల్పడుతుండటం దారుణమన్నారు. ప్రశ్నించిన వాళ్లపైన కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా తప్పుడు కేసులు పెట్టే వాళ్లను, పెట్టించే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మద్దిబోయిన వీర రఘుయాదవ్, కల్యాణ్‌కుమార్, ఉప్పాల మాచర్ల, ప్రభాకర్‌రెడ్డి, ఏకే సుందర్‌రాజు, పాపన మల్లారెడ్డి, గ్రంధం ప్రసన్నాంజనేయులు, సమాధి చైతన్య, సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, షేక్ నాయబ్ రసూల్ తదితరులు ఉన్నారు.
దాడులు చేయడం.. జైలుకు పంపడం వారి నైజం
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment