నిబంధనల మేరకే విధులు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే విధులు

Published Thu, Feb 27 2025 12:38 AM | Last Updated on Thu, Feb 27 2025 12:37 AM

నిబంధనల మేరకే విధులు

నిబంధనల మేరకే విధులు

నెల్లూరు నగరపాలక సంస్థ

కమిషనర్‌ సూర్యతేజ

నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో తనతోపాటు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇతర విభాగాల అధికారులందరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని కమిషనర్‌ సూర్యతేజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ తమకు అన్ని విధాలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తామెవరూ బదిలీలు కావాలని కోరుకోవడం లేదని, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనే పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నామని, తమపై ఎవరి వల్ల ఎలాంటి ఒత్తిడి లేదని సూర్యతేజ స్పష్టం చేశారు.

రేపు జాతీయ

సైన్స్‌ దినోత్సవ వేడుకలు

నెల్లూరు (టౌన్‌): జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్శంగా ఈ నెల 28న స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి కరుణాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారున. ‘2025 థీమ్‌ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సైన్స్‌ ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం’ అనే అంశంపై ప్రాథమిక విద్య 3 నుంచి 8వ తరగతి వరకు, సెకండరీ విద్య 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు బహమతి ప్రదానం చేస్తామన్నారు.

గండిపాళెం ఘటనపై బాలల హక్కుల కమిషన్‌ సీరియస్‌

ఉదయగిరి: మండలంలోని గండిపాళెం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సీరియస్‌ అయింది. ‘విద్యార్థులతో వంట పనులు’ శీర్షిక ఈ నెల 24వ తేదీ సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని కమిషనర్‌ పద్మావతి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమైనందున, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది. విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్‌లు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారు. కానీ వీరు కొన్ని పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. ప్రతి రోజు వంట పనులతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించారు. ప్రతి బ్యాచ్‌లో 15 మంది ఉంటారు. వీరు రోటేషన్‌ పద్ధతిలో వంట పనులు చేస్తున్న పరిస్థితి.

3 నుంచి ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలు

నెల్లూరు (టౌన్‌): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు వచ్చే నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యాసకులు హాల్‌ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్లలో పొందాలన్నారు.

నేడు రాష్ట్ర స్థాయి

ఎడ్ల పందేలు

కొనకనమిట్ల: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. అంబాపురంలోని అంబబాల సంగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో పాలపళ్ల విభాగం నుంచి ఆరుపళ్లు సైజు వరకు (12 క్వింటాళ్ల బండ) ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 10 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొంటున్నాయని, గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు బహుమతులు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు దాతల సహకారంలో ఇస్తున్నట్లు చెప్పారు. శివాలయం వద్ద భక్తులకు అన్నదానం, రాత్రికి విద్యుత్‌ ప్రభ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎడ్ల పందేలకు వచ్చే వారు వివరాలకు 8790612406, 9704364204 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

పక్షుల కేంద్రంలో రైల్వే డీఆర్‌ఎం

దొరవారిసత్రం: మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని బుధవారం విజయవాడ డివిజన్‌ డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ సందర్శించారు. కడప చెట్లపై విడిది చేసిన విహంగాల విన్యాసాలను కెమెరాతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నేచర్‌ గైడ్‌ హుస్సేనయ్య పక్షుల జీవన విధానాలను వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement