
మిల్లర్.. చీటర్
మిల్లర్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. సీజన్ ప్రారంభం కాగానే అన్నదాతల ఎదుట వాలిపోతున్నారు. ధాన్యాన్ని ధర తగ్గించి కొనుగోలు చేసి ఆపై మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యంగా ఆడించి మార్కెట్‌కు తరలించి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండకపోగా.. అడ్డగోలుగా దోచుకెళ్తున్న మిల్లర్లు ఆడించే బియ్యం రేటు మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. దీనిపై అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
సిండికేట్‌గా ఏర్పడి
ధాన్యం ధర తగ్గింపు
● తాము ఆడించే బియ్యానికి
రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు
● తూకాల్లోనూ మోసాలు
● లబోదిబోమంటున్న అన్నదాతలు
● కన్నెత్తి చూడని అధికారులు
సూళ్లూరుపేట: జిల్లాలో మిల్లర్ల మాయాజాలానికి రైతులు, వినియోగదారులు బలవుతున్నారు. మొదట సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. ఆపై బినామీలతో రేట్లు ఉండవని ఊదరగొట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. చివరగా కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతుల నుంచి ఒకటికి సగానికి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో ఆడించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆపై ఆ బియ్యం రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల నుంచి అధికారుల వరకు సహకరిస్తుండటంతో వీరి అక్రమ వ్యాపారం మూడు బస్తాలు.. ఆరు లారీలుగా వర్థిల్లుతోంది.
సీజన్ ప్రారంభం కాగానే..
వరికోతల సీజన్ ప్రారంభం కాగానే మిల్లర్లు దళారులను రంగంలోకి దింపుతారు. బస్తా ధాన్యాన్ని రూ.1,800 దాకా కొనుగోలు చేసి హైప్ చూపిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వీరు పట్టించుకోరు. ఆ తర్వాత మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి దళారుల చేతనే రేట్లు తగ్గిపోయాయని చెప్పిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంటలు బాగా పండటంతో అక్కడ రేట్లు లేవు. తెలంగాణలోని కోదాడ, ఖమ్మం నుంచి భారీగా ధాన్యం వస్తోంది. పైపెచ్చు విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అందుకే రేట్లు భారీగా తగ్గిపోయాయని రైతులను కలవర పెడుతుంటారు. ఆ తర్వాత మిల్లర్ల బినామీలు రంగప్రవేశం చేసి రూ.1,600, రూ.1,650 కొనుగోలు చేస్తారు. గతేడాది రూ.2,200 అమ్మిన బస్తా ధాన్యం ఈ ఏడాది ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్నా స్పందించే వారే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మిల్లర్ల ముడుపులు
మిల్లర్లు సిండికేట్ ఏర్పడి అఽధికార పార్టీ వారికి ముడుపులు చెల్లిస్తారు. ఆపై అధికారులను బుట్టలో వేసుకుని రైతుల కడుపు కొట్టడం ప్రారంభిస్తారు. అన్నదాతలు అప్పుల బారినపడి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారుస్తారు. ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే మిల్లర్లు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తుతారు.
రేషన్ బియ్యాన్నీ వదలకుండా..
రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని తాము ఆడించే బియ్యంలో పాలిష్ పట్టి బస్తాకు 7 నుంచి 9 కిలోల వరకు కలిపేస్తారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు 75 కిలోల ధాన్యం బస్తాకి మరో ఐదు కిలోలు తరుగు కింద లాగేస్తారు. అదే బియ్యం వద్దకొచ్చే సరికి గోతం మీద నెట్ వెయిట్ 25 కిలోలని ఉంటుంది. దాన్ని తూకం వేస్తే 23, 24 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడినా ఎలాంటి చర్యలుండవు. ఎందుకంటే ఆమ్యామ్యాలతో అంతా సర్దేసుకుంటారు మరి.
ఇష్టారాజ్యంగా..
తిరుపతి జిల్లా కంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రైస్ మిల్లులు ఎక్కువ. ముఖ్యంగా నెల్లూరు నగరం చుట్టూ వంద నుంచి 150 రైస్‌మిల్లులున్నాయి. తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పది, శ్రీకాళహస్తిలో మరో పది రైస్ మిల్లులున్నాయి. ఇక తిరుపతి, చంద్రగిరిలో ఐదారు మిల్లుల వరకూ ఉన్నాయి. అదే నెల్లూరులో అయితే ఇదొక పెద్ద ఇండస్ట్రీలా ఉంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి నెల్లూరులోని మిల్లులకే ధాన్యం వెళ్తుంది. రేషన్ బియ్యం కూడా అక్కడి కొన్ని మిల్లులకు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడులో ఇచ్చే రేషన్ బియ్యం (ఉప్పుడు బియ్యం) నెల్లూరు మిల్లులకే తరలిస్తున్నారు. నెల్లూరు అంటే మిల్లర్ల అడ్డాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment