
ఓవైపు అప్పులు.. మరోవైపు ఆరోగ్య సమస్యలు
● ఆత్మహత్య చేసుకున్న యువకుడు
నెల్లూరు సిటీ: ఓవైపు ఆరోగ్య సమస్యలు.. మరోవైపు ఆర్థిక సమస్యలు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చావే దిక్కని నిర్ణయించుకున్నాడు.. గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దొంతాలికి చెందిన సూరిశెట్టి శ్రీనివాసులు (28)కు మల్లేశ్వరితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు కోడూరుపాడు కల్తీ కాలనీలో కాపురం ఉంటున్నారు. శ్రీనివాసులు పాల వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా అతడిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే క్రమంలో పాల వ్యాపారంలో కూడా రూ.20 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. అప్పుల బాధ తట్టుకోలేకపోయాడు. ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి వద్ద గన్నేరు పప్పు తిని అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
51.938 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 51.938 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 620, పిన్నేరు కాలువకు 120, లోలెవల్ కాలువకు 210, హైలెవల్ కాలువకు 210, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
వీఎస్‌యూలో
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) నేషనల్ యూత్ పార్లమెంట్ – 2025 వాల్‌పోస్టర్లను వీసీ అల్లం శ్రీనివాసరరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్రానికి బాధ్యతలు అప్పగించారన్నారు. ఆసక్తి గల వారు మై భారత పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్‌పై ఒక నిమిషం నిడివి గల వీడియోను చిత్రీకరించి అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించారు. 150 మందిని ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మాట్లాడేలా అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిభ చూపిన పదిమందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో యూత్ పార్లమెంట్‌కు పంపిస్తారని తెలియజేశారు. అక్కడ ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో తమ ఆలోచనలను వెల్లడించేందుకు అవకాశం కల్పిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్‌శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఐటీఐలో జాబ్‌మేళా
నెల్లూరు(టౌన్): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్‌లు సంయుక్తంగా నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, అమర్‌రాజా బ్యాటరీస్ తదితర కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు హాజరుకావొచ్చన్నారు. వివరాలకు 94944 56326, 97045 10793 ఫోన్ నంబర్లును సంప్రదించాలని తెలియజేశారు.

ఓవైపు అప్పులు.. మరోవైపు ఆరోగ్య సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment