ఉత్తమ పంచాయతీగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

Published Sat, Mar 15 2025 12:07 AM | Last Updated on Sat, Mar 15 2025 12:07 AM

ఉత్తమ

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ మండలంలోని పాతవెల్లంటి గ్రామం... మద్య పానానికి దూరం. నేటి కాలంలో కూడా ఇలాంటి ఆదర్శ గ్రామం ఉండడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడో ముపై ఏళ్ల క్రితం విధించుకున్న స్వీయకట్టుబాటును ఇప్పటికీ అమలు చేస్తోంది. ఈ విషయంలో అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. 1994 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లుగా గ్రామంలోకి మద్యం ప్రవేశించకుండా గ్రామ పెద్దలు కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కట్టుబాటును ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రస్తుతం యువత కూడా పెద్దల కట్టుబాటును కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

పాతవెల్లంటి గ్రామంలో మొత్తం 650 కుటుంబాలు ఉన్నాయి. 1200 ఓటర్లు ఉండగా, 3 వేల మంది వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో 1994 నుంచి సీపీఎంకు చెందిన అభ్యర్థులే సర్పంచులుగా గెలుస్తున్నారు. ప్రభుత్వాలు మారినా గ్రామ కట్టుబాటు మాత్రం మారకుండా పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా మద్యం బాటిల్లు తీసుకొచ్చినా, మద్యం సేవించినా వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మద్యం సేవించాలంటే పక్క గ్రామాలకు వెళ్లాల్సిందే.

30 ఏళ్లుగా పాతవెల్లంటిలో వైన్‌ షాపు ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి చెందిన పెద్దలు కూడా సాహసం చేయలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 10 బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అయితే పాత వెల్లంటిలో మాత్రం బెల్టు దుకాణం నిర్వహిస్తే బెండు తీస్తారు. బెల్టు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే గ్రామస్తులే పోలీసులకు అప్పగిస్తారు. కల్లు దుకాణాలు కూడా ఊరి బయట పెట్టుకోవాలని పెద్దలు నిర్ణయించారు.

పాత వెల్లంటి గ్రామానికి సమీపంలో పెన్నా పరీవాహక ప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుకను గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా నిర్ణయించుకున్నారు. బయటకు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే రూ.10 వేలు జరిమానా విధించేలా నిబంధనలు విధించారు. ఈ క్రమంలో గ్రామంలోని పెన్నా నుంచి ఇసుకను బయటకు తరలించేందుకు ఎవరూ ప్రయత్నం కూడా చేయరు. గ్రామంలోని కట్టుబాట్లను అతిక్రమించిన వారి నుంచి వసూళ్లు చేసిన జరిమానాలు గ్రామాభివృద్ధి, ఆలయాభివృద్ధికి ఖర్చు చేయడం గమనార్హం.

పారిశుధ్య నిర్వహణ, గ్రామ సభల నిర్వహణలో కేంద్రం 2021 సంవత్సరానికి పాత వెల్లంటి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గ్రామ సభ కేటగిరీ కింద ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి గ్రామానికి కేంద్రం రూ.10 లక్షలు నిధులు కేటాయించింది. ఆ నిధులతో గ్రామానికి సీసీరోడ్డును నిర్మించుకున్నారు.

ఇసుక తరలిస్తే రూ.10 వేలు జరిమానా

ఆ ఊరులో మూడు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతోంది. స్థానికులు ఈ ఊరులోనే కాదు.. బయట ప్రాంతాలకు వెళ్లినా మద్యం ముట్టరు. మద్యం తాగడం ఈ తరం యువతకు ఒక ఫ్యాషన్‌. నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు ఊర్లలో ఏ పండగొచ్చినా.. చావొచ్చినా.. ఎన్నికలొచ్చినా.. మందు బాటిల్‌ ఓపెన్‌ కావాల్సిందే. కానీ ఆ పల్లె అందుకు ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరు ఈ కట్టుబాటును విధించుకుంది. ఈ విషయంలో అక్కడి జనం రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఎవరైనా మద్యం తాగితే జరిమానా కట్టాల్సిందే. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మద్యానికి దూరంగా ఉంటున్నారు.

30 ఏళ్లుగా ప్రత్యేక కట్టుబాటును కొనసాగిస్తున్న గ్రామస్తులు

నిబంధనలు అతిక్రమిస్తే

రూ.10 వేల జరిమానా

పెన్నా నుంచి ఇసుక బయట ప్రాంతాలకు తరలించకుండా ఆంక్షలు

బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తే..

ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగింత

2021లో ఉత్తమ పంచాయతీగా

పాతవెల్లంటి గ్రామం

అదృష్టంగా భావిస్తున్నా..

ఈ గ్రామంలో తాను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామస్తులు మద్యాన్ని గ్రామంలోకి రానివ్వకుండా నిబంధనలు పెట్టడం సంతోషంగా ఉంటుంది. పెద్దల కట్టుబాట్లను ఎవరూ అతిక్రమించకుండా కొనసాగిస్తున్నాం.

– వనం, సుబ్బమ్మ, గ్రామస్తురాలు

యువత కూడా బాధ్యతగా తీసుకుంది

గ్రామంలోకి మద్యం అనుమతి లేకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని యువత కూడా బాధ్యతగా తీసుకుని నడుచుకుంటుంది. రానున్న రోజుల్లో కూడా తాము కట్టుబాట్లను ఏ మాత్రం చెదరకుండా కొనసాగిస్తాం.

– గుడి ఆనంద్‌, రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
ఉత్తమ పంచాయతీగా ఎంపిక 1
1/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

ఉత్తమ పంచాయతీగా ఎంపిక 2
2/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

ఉత్తమ పంచాయతీగా ఎంపిక 3
3/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

ఉత్తమ పంచాయతీగా ఎంపిక 4
4/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

ఉత్తమ పంచాయతీగా ఎంపిక 5
5/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

ఉత్తమ పంచాయతీగా ఎంపిక 6
6/6

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement