కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● 6, ఇంటర్ తరగతులకు దరఖాస్తులు
దుత్తలూరు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి జిల్లా సమగ్ర శిక్షా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తులు చేసుకుని అర్హులైన బాలికలు ఆరో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొందవచ్చు. జిల్లాలో 12 కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు. ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించి 40 సీట్లు కేటాయించారు. జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు, వలేటివారిపాళెం, సీతారామపురం, కొండాపురం, కావలి కేజీబీవీల్లో ఎంపీసీ గ్రూపు, నందిపాడు, ఏఎస్‌పేట, గుడ్లూరు, లింగసమద్రం కేజీబీవీల్లో బైపీసీ, కలిగిరి, మర్రిపాడు కేజీబీల్లో ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
సమష్టి కృషితోనే
వెలుగొండ జలాలు సాధ్యం
ఉదయగిరి: నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల ప్రజలు ఉద్యమిస్తేనే వెలుగొండ జలాశయం పూర్తయి సాగు, తాగునీరు అందుతాయని వెలుగొండ ప్రాజెక్ట్ జలాల సాధన సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. స్థానిక షాదీ మంజిల్‌లో ఆదివారం వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెలుగొండ జలాశయం పూర్తయితే మూడు జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు. 29 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా కొనసాగుతుండడం చూస్తే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోందన్నారు. ఏపీ అంటే ఒక అమరావతో, ఒక పోలవరమో కాదని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.7 వేల కోట్లు అవసరం కాగా, ఈ ప్రభుత్వం కేవలం రూ.309 కోట్లు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించడం దారుణమన్నారు. కేవలం ఏడు వేల కోట్లతో వెలుగొండ ద్వారా మూడు జిల్లాల మెట్ట ప్రాంతాలకు జలాలు అందించే అవకాశం ఉంటే.. రూ.80 వేల కోట్లు పెట్టి గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం రాజకీయ నేతలు, మేధావులు, రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకతపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్, ఎం.రమేష్, దామా అంకయ్య, అజయ్‌కుమార్, బసిరెడ్డి మాలకొండారెడ్డి, దస్తగిరి అహ్మద్, ఫడ్స్ రమణయ్య, కామేపల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
అతిగా మద్యం తాగి
వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి తన ఇంట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్‌లో జరిగింది. పోలీసులకు సమాచారం మేరకు.. బ్లాక్ నంబర్ సీ 28లో సర్దార్ బాషా (32) ఒంటరిగా నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన సర్దార్ బాషా శనివారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఆదివారం పక్క ఫ్లాట్‌లోని వ్యక్తి వచ్చి ఎన్నిసార్లు తలుపుతట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే బాషా నోట్లో నుంచి నురగ వచ్చి మృతి చెందాడు. నవాబుపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment