హామీలు మరిచి అవాస్తవాల ప్రచారం
● కూటమి సర్కార్‌పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధ్వజం
నెల్లూరు(బారకాసు): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని రాంజీనగర్‌లో ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 17 మంది వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించి తొలగించిందన్నారు. ఈ విషయంపై తాము ఆధారాలు బయటపెడితే విచారణ జరుపుతామని చెప్పిన మంత్రి లోకేశ్ ఇప్పటికీ విచారణ జరపకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 2023–24 సంబంధించి మూడు క్వార్టర్స్ 2024–25 ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్స్ మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు రూ.5,252 కోట్లు టీడీపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. అలాగే వసతి దీవెనకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఈ బకాయిలన్నీ విడుదల చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి మీద అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ప్రవేశపెట్టి 45 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి భృతి అందిస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిలువునా దగా చేసిందన్నారు. పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు పాలు చేశారన్నారు. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment