నిబద్ధతతో వ్యవహరించండి
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రైటర్లు నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెలిస్తే మీడియా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు ఉన్నప్పుడు ఈ సమస్యే ఉండేది కాదని, అయితే ఇప్పుడు ఎవరుపడితే వారు ముందుకొస్తున్నారని చెప్పారు. ఐకమత్యంతో ఉంటేనే రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఓకే చేసే ప్రక్రియకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు సీతాపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment