సహనాన్ని చేతికానితనం అనుకోవద్దు
● తిరగబడే రోజు వస్తుంది
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి, రూరల్ సమన్వయకర్త ఆనం
● కూటమి ప్రభుత్వ అరాచకాలపై ఏఎస్పీకి
వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
నెల్లూరు సిటీ: టీడీపీ నాయకులు తమ సహనాన్ని చేతకాని తనం అనుకోవద్దని, తిరగబడే రోజు వస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్‌పై స్పష్టమైన ఆధారాలు లేకుండా అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తోందని తెలిపారు. వైకాపా మహిళా విభాగం నేత రమాదేవి ఇంటి మీదకు వెళ్లి టీడీపీ నేతలు దాడి చేస్తే, ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. వారి కుటుంబంపై దాడికి సంబంధించిన వీడియోలు బయటపెట్టినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందన్నారు. అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటామని తాము కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సహనాన్ని చేతికాని తనం అనుకోవద్దని, త్వరలో తిరగబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని పోలీసు గ్రీవెన్స్‌లో సోమవారం ఏఎస్పీ సౌజన్యకు కాకాణి, ఆనం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌లో రౌడీయిజం ఎక్కువైంది. మాట వినకపోతే దాడులు లేదంటే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసి వారి మీదే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. రూరల్‌లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment