
అనంతపురం : ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాలు ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా విస్తరించాయి. ఈ మేరకు సోమవారం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఛాయాచిత్రం స్పష్టం చేస్తోంది. ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 13న శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలను కూడా తాకాయి. కానీ... వాతావరణం అనుకూలించక ఐదారు రోజులు దోబూచులాడిన పవనాల్లో ఆదివారం కదలిక వచ్చింది.
సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో దాదాపు విస్తరించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.అశోక్‌కుమార్ తెలిపారు. రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉందన్నారు.
ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి ఉందన్నారు. నైరుతి విస్తరించడంతో వర్షం కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు. విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉన్న రైతులు ఖరీఫ్ పంట సాగు కోసం సమాయత్తంగా ఉన్నారు. జూలై నెలంతా విత్తుకునేందుకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంకా సమయం ఉన్నందున వర్షం పడితే సాఫీగా సేద్యపు పనులు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment