పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలో ఇష్టారాజ్యం
ఎమ్మెల్యేల బంధువుల తీరుతో అధికారులకు ఇబ్బందులు
సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తుండటంపై విస్మయం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడిచింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అప్పుడే నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఎమ్మెల్యేల బంధువులు, అనుచరులు, పీఏలు పెత్తనం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఇదేనా మీరు మాకు చేసే సేవ అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సాక్షి, పుట్టపర్తి : జిల్లాలో షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తోంది. ఎమ్మెల్యే ఒకరైతే.. కుటుంబ సభ్యుల్లో మరొకరు పెత్తనం చేస్తూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే పుట్టపర్తి, మడకశిర, హిందూపురంలో ప్రజలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. షాడో ఎమ్మెల్యేలకు ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలిస్తుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ బదిలీ చేస్తారోనని భయపడిపోతున్నారు. జనం కూడా షాడో ఎమ్మెల్యేల తీరుపై పెదవి విరుస్తున్నారు.
ధర్మవరంలో చక్రం తిప్పుతున్న శ్రీరామ్..
ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఇతర ప్రాంతాలకే పరిమితం కాగా...నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చక్రం తిప్పుతున్నారు. అన్ని విషయాల్లోనూ ఆయనే జోక్యం చేసుకుంటున్నారు. తాను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌నంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులను బదిలీలు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారు. రాప్తాడులోనూ పరిటాల సునీత ఎమ్మెల్యే అయినప్పటికీ.. అక్కడ కూడా పరిటాల శ్రీరామ్ రాజ్యమేలుతున్నారు. ఎలాంటి పదవి లేకున్నా.. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.
హిందూపురంలో పీఏల పాలన..
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఆయన పీఏ (పర్సనల్ అసిస్టెంట్) లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. 2014లో బాలయ్య తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. శేఖర్ అనే వ్యక్తి పీఏగా ఉంటూ తానే లోకల్ ఎమ్మెల్యే అన్న తరహాలో ప్రవర్తించారు. మరో పీఏ పేకాట ఆడుతూ కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం మరో ఇద్దరు పీఏలు తామే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నామని చెబుతున్నారు. కనిపించని ఎమ్మెల్యే కంటే కళ్లముందుండే పీఏనే బెటరని కార్యకర్తలు కూడా వారి చుట్టే తిరుగుతున్నారు.
మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ హవా..
ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో పెత్తందారు గుండుమల తిప్పేస్వామి హవా నడుస్తోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎవరైనా.. పెత్తనం మాత్రం మాజీ ఎమ్మెల్సీ గుండుమలదే. అధికారుల బదిలీలు, పాలనా వ్యవహారాలతో పాటు కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎమ్మెల్యే తరహాలో అధికారం చెలాయిస్తున్నారు. తనను వ్యతిరేకిస్తే.. టీడీపీలో మనుగడ సాగించడం కష్టమని, భయపెడతారనే ఆరోపణలున్నాయి.
నామినేటెడ్ కోసం లాబీయింగ్..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల నేతలు నామినేటెడ్ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే బదులు షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తుండటంతో ఎవరిని ప్రసన్నం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగులు తదితర వ్యవహారాల్లోనూ షాడో ఎమ్మెల్యేలే కీలకపాత్ర పోషిస్తున్నారు.
పుట్టపర్తిలో ఎమ్మెల్యే మామదే పెత్తనం..
జిల్లా కేంద్రం పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి పేరుకే ఎమ్మెల్యే. అంతా ఆమె మామ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డే చూసుకుంటారు. ఆయనే నేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. చెప్పినట్లు వినని అధికారులను బదిలీ పేరుతో బెదిరిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే కంటే ఆయనే ముందు ఉంటూ షాడో ఎమ్మెల్యేగా మారారు. నియోజకవర్గంలోని అధికారులు, నాయకులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రతి సమావేశంలోనూ ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment