
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం బహిరంగ సభలో ఊకదంపుడు ప్రసంగం
వినలేక విసుగేసి వెనుదిరిగిన జనం
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్‌లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు.
కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
అర్థం కాని మాటలు, సినీ డైలాగ్‌లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్‌ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment