ఆయుధ వినియోగంపై నైపుణ్యాలు పెంపొందించుకోండి : ఎస్పీ
పుట్టపర్తి టౌన్: విధుల్లో భాగంగా వినియోగించే ప్రతి ఆయుధం పనితీరు, దాని నిర్వహణపై నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సిబ్బందికి ఎస్పీ రత్న సూచించారు. బుక్కపట్నం మండలం చండ్రాయునిపల్లి సమీపంలో మొబలైజేషన్ ఫైరింగ్ మైదానంలో ఏఆర్ పోలీసులకు నిర్వహిస్తున్న ఫైరింగ్ ప్రాక్టీసును మంగళవారం ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు వలి, మహేష్, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ఆర్ఎస్ఐలు ప్రదీప్‌సింగ్, వీరన్న, మహష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పట్టు పురుగులపై విషప్రయోగం
మడకశిర రూరల్: మండలంలోని దొడ్డేపల్లి గ్రామంలో పట్టు పరుగుల చంద్రికలపై విష ప్రయోగం జరిగింది. సోమవారం సాయంత్రం చంద్రికలను శుభ్రం చేసి షెడ్ బయట ఉంచినప్పుడు గిట్టని వారు విష ప్రయోగం చేసి ఉంటారని బాధిత రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చంద్రికల్లోకి వదిలిన పట్టు పురుగులు కాసేపటికే చనిపోయాయన్నారు. ఘటనతో రూ.1.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమ శాఖ ఏడీ రాజు... దొడ్డేపల్లిలోని బాధిత రైతు మల్బరీ షెడ్‌ను పరిశీలించారు. విష ప్రయోగం కారణంగానే పట్టుపురుగులు మృతి చెందాయని నిర్ధారించారు.
కారు బోల్తా .. మహిళ మృతి
గుత్తి రూరల్: కారు బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన శ్రీలత (38), తన కుటుంబంతో కలసి హైదరాబాదులో స్థిరపడ్డారు. బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో మంగళవారం ఉదయం కారులో హైదరాబాద్ నుంచి కదిరికి బయలుదేరారు. గుత్తి మండలం పోదొడ్డి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీలతను స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వల్ప గాయాలైన వారికి చికిత్స అందజేశారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment