పరీక్ష పత్రాలకు రెక్కలు!
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగం అధికారుల అంతులేని అలసత్వం మరోసారి బయట పడింది. ఈ సారి ఏకంగా విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు గల్లంతు కావడం దుమారం రేపింది. నెల రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం గమనార్హం. తమ భవిష్యత్తును నిర్దేశించే జవాబు పత్రాలు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
జాడలేని జవాబు పత్రాలు..
జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల అయిన వేము ఇంజినీరింగ్ కళాశాల (చిత్తూరు, తిరుపతి రోడ్డు)లో ఈసీఈ మూడో సంవత్సరం ఆర్–20 రెగ్యులర్ పరీక్ష అయిన కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్ సబ్జెక్టు పరీక్షను డిసెంబర్ 10న నిర్వహించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం నిర్వాహకులు వెంటనే రిజస్టర్ పోస్టు ద్వారా జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగానికి పంపుతారు. ఈ మేరకు రిజిస్టర్ పోస్టులోనూ నమోదు చేశారు. జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగంలోనూ జవాబు పత్రాలు వచ్చినట్లు నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా జేఎన్టీయూ పరీక్షల విభాగంలో జవాబు పత్రాలు కనిపించకుండా పోవడం ఆందోళన రేపింది. పరీక్షల విభాగాన్ని సిబ్బంది జల్లెడ పట్టినా వాటి జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైనట్లయింది. పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యం తలెత్తింది. అయితే, నెల రోజుల క్రితమే విషయం బయటపడినా.. వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెట్టాలని ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పరిశీలించాలని చెప్పాం
జవాబు పత్రాల గల్లంతు వ్యవహారం రెండు రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించాలని ఆదేశించాం.
– హెచ్. సుదర్శనరావు, ఇన్చార్జ్ వీసీ
193 మంది విద్యార్థుల
జవాబుపత్రాల గల్లంతు
ఎంత గాలించినా దొరకని వైనం
మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు
అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు
Comments
Please login to add a commentAdd a comment