ప్రకృతి వ్యవసాయం భేష్
రొళ్ల: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) ప్రాజెక్ట్ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిఽధి బృందం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక అభివృద్ధి, పర్యావరణంలో మార్పు తీసుకురావడం కోసం కృషి చేస్తున్న ఇంగ్లాండ్, అమెరికా (న్యూయార్క్) ఎన్‌జీఓలకు చెందిన మిచ్ రిజినిక్, గ్రెగ్ డ్యూల్సికితో పాటు ఢిల్లీకి చెందిన గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లాంట్ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాటి, హైదరాబాద్ చెందిన సూరజ్ తేజ తదితరులు మంగళవారం రొళ్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా హనుమంతనపల్లి, వన్నారనపల్లి, ఆవినకుంట గ్రామాల్లో రైతులు లక్ష్మమ్మ, నారాయణప్ప, గంగమ్మ, కృష్ణప్ప తదితరులు ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో సాగు చేసిన బొప్పాయి, ఆకుకూరలు, కూరగాయలు, అలసంద, చింత, మామిడి, అరటి, అవిసె, అనుములు, మిరప, కంది, కొబ్బరి, ఆముదం, సజ్జ, ముల్లంగి, బీట్‌రూట్, క్యారెట్, గోరుచిక్కుడు, మొక్కజొన్న తదితర పంటలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే ఘన, ద్రవ జీవామృతం తయారీ విధానం, విత్తన గుళికలు, విత్తన శుద్ధి ఇతరాత్ర వాటి గురించి జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్ వివరించారు. అనంతరం రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న తొమ్మిది సార్వత్రిక సూత్రాలను విదేశీ బృందానికి వివరించారు. అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఏడాది పొడవునా పంటలు పండించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం ఏపీసీఎన్‌ఎఫ్ ప్రాజెక్ట్ అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులతో విదేశీ బృందం సభ్యులు చర్చించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ఏపీఎం బీమరాజు, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త డా. నవీన్, కోఆర్డినేటర్ భానుమతి, ఎంటీ రమేష్, ఇన్‌చార్జ్ హనుమంతరాయప్ప, లక్ష్మీకాంత్, సెర్ప్ సిబ్బంది, ఎంఎంఎస్, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అమెరికా, ఇంగ్లాండ్ దేశాల
ప్రతినిధుల ప్రశంస
రొళ్ల మండలంలో ప్రకృతి వ్యవసాయ పంటలసాగు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment