బ్రహ్మోత్సవం చూతము రారండి
● 5 నుంచి కొండమీదరాయుడి
బ్రహ్మోత్సవాలు
● 12న తిరునాల, రథోత్సవం
బుక్కరాయసముద్రం: మండలంలో కొలువైన కొండమీదరాయ స్వామి ఉత్సవాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 5 సాయంత్రం బుక్కరాయసుద్రంలోని లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను కొండపైకి తీసుకెళ్తారు. 6న ఉదయం 8 గంటలకు దేవరకొండపై పుణ్యాహవాచనము, దేవతా హోమం, ధ్వజా రోహనము, గరుడ ఆహ్వాన పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ ఉంటుంది. 7న స్వామి వారిని సింహ వాహనంపై మండల కేంద్రంలో ఊరేగిస్తారు. 8న శేష వాహన, 9న హనుమద్వాహన, 10న గరుడ, 11న శ్వేత గజ వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కల్యాణ, రథోత్సవాలు ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్నాయి. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఇక.. 13న రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, 14న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవలు నిర్వహించనున్నారు.
పట్టు రైతులకు సబ్సిడీపై యంత్రాలు
హిందూపురం అర్బన్: జిల్లాలోని పట్టు రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించిన అర్హులకు పవర్ స్ప్రేయర్లు, బ్రష్కట్టర్లు, పవర్ ఫీడర్, పవర్ టిల్లర్, షూట్ కటింగ్ మిషన్, బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లను సబ్సిడీతో అందిస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘పది’లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి
● ఉపాధ్యాయులకు డీసీఓ
జయలక్ష్మీ ఆదేశం
రొళ్ల: పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని డీసీఓ జయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో చర్చించారు. పదో తరగతి మార్కులు జీవితంలో ఎంతో విలువైనవని, అందువల్ల విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలకు బాగా సిద్ధం కావాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోజూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మైలారప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment