చక్రతీర్థ స్నానాలకు ముమ్మర ఏర్పాట్లు
జలుమూరు, ఎల్‌ఎన్ పేట: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు శుక్రవారం వంశధార నదిలో జరగనున్న స్వామివారి త్రిశూల్ చక్రతీర్థ స్నానాల పుణ్యక్రతువుకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్‌ఆర్‌విఎస్‌ఎన్‌ఆర్ మూర్తి గురువారం తెలిపారు. ప్రధాన ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామి ఉత్సవ మూర్తులను నదికి తీసుకెళ్లనున్నట్లు ఈఓ ప్రభాకరరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నదిలో రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. ఉత్సవమూర్తులను నదికి తీసుకెళ్లే సమయంలో 50 నుంచి 55 వరకూ రోప్ పా ర్టీ లు వినియోగిస్తున్నామని, అలాగే నదికి ఇటు 480 మంది అటు సరుబుజ్జిలి వైపు 450 మందితోపాటు అదనంగా 140 మందిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిరాయపల్లి రేవులో పుణ్యస్నానాలు జరిగే సమయంలో భక్తుల రద్దీ, అల్లరిమూకల నిలుపుదల, శ్రీముఖలింగం గ్రామానికి రెండువైపులా ట్రాఫిక్ నియంత్రణ, పుణ్యస్నానాలు అనంతరం భక్తులు తిరిగి వారి స్వగ్రామాలకు చేర్చడం ప్రధానమని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నదిమార్గం కూడా ధూళి, దుమ్ము రేగకుండా ట్రాక్టరలతో నీరు చల్లేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీ విస్తరణ అధికారి ఉమా మహేశ్వరరావు తెలిపారు. అలాగే వైద్య శిబిరం కూడా కొనసాగుతుందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తాడేల శ్రీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment