దేవుడి భూములు కబ్జా!
● సింగుపురంలో అన్యాక్రాంతమవుతున్న హఠకేశ్వరుడి స్థలం
● రెండంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
● కూటమి నేతల అండదండలతో ఇష్టారాజ్యం
● పట్టించుకోని దేవదాయశాఖ అధికారులు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురంలో హఠకేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సర్వే నంబర్ 260/14లో 84 సెంట్ల విస్తీర్ణంలో దేవుడి భూములు ఉన్నాయి. అయితే ప్రధాన రహదారిని అనుసరించి ఓ వ్యక్తి సుమారు 6 సెంట్ల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని అడ్డగోలుగా నిర్మించేశాడు. వాస్తవంగా ఈ స్థలాన్ని పూర్వం నుంచి గ్రామస్తులు రాకపోకలకు వాడుకునేవారు. స్థానికుల ఇళ్ల నుంచి వాడుక నీరు వెళ్లేందుకు సైతం పిల్లకాలువలా ఉండేది. ప్రస్తుతం అక్రమ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుండానే..
వాస్తవంగా ఏదైనా భవనం నిర్మాణం చేపట్టాలంటే పంచాయతీ నుంచి అన్ని అనుమతులు విధిగా తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ప్లాన్ అప్రూవుల్ లేకుండానే రెండు అంతస్తుల భవనం నిర్మించడం గమనార్హం. కూటమి నేతల అండదండలు ఉండటంతోనే పనులు దర్జాగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
సింగుపురంలోని దేవుడు మాన్యం భూములను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధాన మార్గంలో భూములే కబ్జాలకు గురవుతున్నాయంటే ఇంకా లోపల ఉన్న భూములు పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన దేవదాయశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవదాయశాఖ అధికారి మాధవి వద్ద ప్రస్తావించగా తొలుత నోటీసులు అందించామని, తర్వాత తన దృష్టికి రాలేదని మాట దాటవేశారు.
నోటీసులు అందించాం
దేవుడు మాన్యం భూములు కబ్జాకు గువుతున్నాయని సమాచారం రావడంతో భవన నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి సింగుపురం గ్రామ పంచాయతీ తరఫున నోటీసులు అందించాం. దేవుడి మాన్యం భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత దేవాదాయశాఖదే.
– రమేష్, పంచాయతీ సెక్రటరీ, సింగుపురం
Comments
Please login to add a commentAdd a comment