కార్పొరేటరీకరణకు వ్యతిరేకంగా పోరాటం
పలాస: బొడ్డపాడు యువజన సంఘం ఆశయాలను, ఆశలను ప్రతిబింబించాలంటే దేశంలో జరుగుతున్న కాషాయీకరణ, కార్పొరేటు వ్యవస్థల విధానాలకు వ్యతిరేకంగా యువతరం కదం తొక్కాలని హైదరాబాద్‌కు చెందిన వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. 1954లో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాల్లో సంఘం నాయకులు పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. అయినా వెనకడుగు వేయకుండా నేటికీ పోరాటం కొనసాగిస్తూ అమరుడు తామాడ గణపతి మనవడు తామాడ క్రాంతి అధ్యక్షతన శనివారం వార్షికోత్సవ సభ ఏర్పాటు చేశారు. ముందుగా కార్మిక పతాకాన్ని అమరుల బంధు మిత్రుల కమిటీ నాయకుడు జోగి కోదండరావు ఆవిష్కరించారు. అనంతరం బొడ్డపాడు యువజన సంఘం పతాకాన్ని క్రాంతి ఆవిష్కరించారు. ప్రజాకళామండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథం, కె.ఎన్.పి.ఎస్.నాయకుడు బెలమల ప్రభాకర్, డి.టి.ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, పి.కె.ఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, ఎ.బి.ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తామాడ త్రిలోచనావు, టెక్కలి డివిజన్ రైతాంగ కమిటీ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీరాములు, యువజన సంఘం సీనియర్ సభ్యుడు బచ్చల విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment