ఊపిరి తీసుకున్న అన్న
కొనఊపిరితో తమ్ముడు..
● వ్యాపారంలో నష్టాలు రావడంతో యాసిడ్ తాగేసిన తమ్ముడు ● బతకడం కష్టమన్న వైద్యులు ● మనస్థాపంతో ఉరి వేసుకున్న అన్నయ్య ● అలుదులో విషాదఛాయలు
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి బయట గదిలో ఓ వ్యక్తి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన శెట్టిసూరి, ఉమామహేశ్వరావులు అన్నదమ్ములు. వీరిద్దరూ కలిసి గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం.. నష్టాలు రావడంతో కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కిందట తమ్ముడు ఉమామహేశ్వరరావు తీవ్ర ఒత్తిడికి గురై యాసిడ్ తాగేశాడు. వెంటనే బాధితుడిని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. బతకడం కష్టమేనని వైద్యులు చెప్పడంతో మనస్థాపానికి గురై అన్నయ్య శెట్టి సూరి(40) ఆసుపత్రి బయట ఓ రూమును అద్దెకు తీసుకొని గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్‌కు వెళ్లిన సూరి ఎంత కూ తిరిగి రాకపోవడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బంధువులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించా డు. విషయాన్ని రూరల్ పోలీసులకు తెలియజేశారు. సూరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు.