ఈఈ కార్యాలయ నూతన భవనానికి రూ 7.99 కోట్లు
హుజూర్‌నగర్ : నీటిపారుదల శాఖ హుజూర్‌నగర్ డివిజన్ ఈఈ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుజూర్‌నగర్ పట్టణంలో ఈ భవన నిర్మాణానికి రూ 7.99 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం జీఓ నంబర్ 42 జారీ చేసింది. సాంకేతిక అనుమతుల తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
12న అరుణాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు
భానుపురి (సూర్యాపేట) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలంగిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఈనెల 12వ తేదీన సూర్యాపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12న రాత్రి 8 గంటలకు డిపో నుంచి బయలుదేరి 13న ఉదయం కాణిపాకం, సాయంత్రం వేలూరు గోల్డెన్ టెంపుల్, రాత్రి 12 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 14న అరుణాచలం గిరిప్రదక్షిణ, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం 5గంటలకు బయలుదేరి 15న శనివారం సూర్యాపేటకు చేరుకుంటుందని పేర్కొన్నారు. యాత్రకు వెళ్లేందుకు భక్తులు ఒక్కరికి రూ.4వేలు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసం బుకింగ్ ఇన్‌చార్జ్ ఏకాంబరం సెల్ నంబర్లు 9951613278, 7382836177లను సంప్రదించాలన్నారు.
17లోపు సీఎంఆర్ బకాయిలు ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలు ఈనెల 17లోపు ఇవ్వాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2022–23కి సంబంధించి సీఎంఆర్ బకాయి పడిన మిల్లర్లు నిర్దేశించిన గడువు లోపు ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖకు పంపించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచే అవకాశం లేదన్నారు. ఏ ఒక్కరికీ మినహాయింపు లేదన్నారు. అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మిల్లు వారీగా ఎంత బకాయి పంపిస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, ఏసీఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లయ్ డీటీలు, ఆర్‌ఐలు, మిల్లర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.లత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు తమ కళాశాల లాగిన్‌లో ఈ నెల 7వ తేదీ లోపు డిజిటల్ కీ రిజిస్టర్ చేసుకొని ఉపకార వేతనాల దరఖాస్తులను పరిశీలించి జిల్లా అధికారులకు ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు.
అర్హతలేని వైద్యం చేస్తే కఠినచర్యలు
కోదాడ రూరల్: అర్హత లేకుండా వైద్యం చేసే వారిపై కఠినచర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. కోదాడ మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డులో గత కొంత కాలంగా శౌకత్‌అలీ అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకున్నా, అనుమతి లేని బోర్డుతో ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్యం చేస్తుండగా జిల్లా వైద్యాధికారి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం తన బృందంతో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు గుర్తించి నిర్ధారించి క్లినిక్‌ను మూసివేశారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఎక్కడైనా అర్హత లేకుండా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా, స్టాటిస్టికల్ అధికారి వీరయ్య, డాక్టర్ మౌనిక, ఏఎస్‌ఐ జ్యోతి , సభి కన్సల్టెంట్ ఎలిశమ్మ, కార్తీక్ పాల్గొన్నారు.
ఈఈ కార్యాలయ నూతన భవనానికి రూ 7.99 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment