
కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.నరసింహ సోమవారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, కేసుల్లో నేరస్తులకు శిక్ష అమలు, అక్రమ రవాణా నిరోధం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, పోలీసు సేవలు తదితర అంశాలపై చర్చించారు.
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి బోయినపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె.శంకర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2025 ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయస్సు ఉండి ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న జిల్లాలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను పొంది ఈనెల 17వ తేదీ లోగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
నేడు ఎస్సీ,
ఎస్టీ కమిషన్ పర్యటన
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు.
ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 7,424 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షను 32 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 7,704 మంది విద్యార్థులకు 280 మంది గైర్హాజరు కాగా 7,424 మంది హాజరైనట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు చెప్పారు.
ప్రణయ్ హత్యకేసు తీర్పు చెంపపెట్టు లాంటిది
భానుపురి (సూర్యాపేట) : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు లాంటిదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. ప్రణయ్ హత్యకేసు తీర్పుపై సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రణయ్ కేసు తీర్పు ఉందన్నారు. రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. ఇటీవల సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణను అతి కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ల హస్సన్, సీనియర్ జర్నలిస్ట్ బంటు కృష్ణ, పల్లె మనిబాబు, శిరంషెట్టి ఆనంద్, వెంకన్న, జె.నరసింహారావు, వెంకట్ రెడ్డి, నాగయ్య, దేవయ్య, వెంకటనరసయ్య, బోయిల్ల అఖిల్ , సుధాకర్, సతీష్ పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment