
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి వేడుక నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు.
శ్రీచక్రతీర్థం..
మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు.
దేవతలకు వీడ్కోలు
నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవంనిర్వహించారు. మహోత్సవంలో దోఽషములు తొలగించేందుకు పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment