భువనగిరి: పట్టణంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడు మృతి
మిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ సమీపంలో గల ఫంక్షన్‌హాల్‌లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడు
ఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది
భువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో జరిగింది. భువనగిరి ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్‌కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్‌ను బయటకు లాగాడు. దీంతో అతడికి ఎటువంటి గాయాలు కాలేదు.
బైక్ చోరీ కేసులో జైలు శిక్ష
చివ్వెంల (సూర్యాపేట): బైక్ చోరీ కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత గురువారం తీర్పు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన చౌడం పవన్ కుమార్ గత సంవత్సరం ఫిబ్రవరి 29న పట్టణంలోని విద్యానగర్‌లో తన ఇంటి ఎదుట రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేశాడు. తెల్లవారుజామున లేచి చూసేవరకు బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ మహేంద్రనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అపహరణకు పాల్పడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు సీతారాములు జిల్లా, యాటపాక మండలం బుట్టయ్య గూడెం గ్రామానికి చెందిన వాసం మనోహర్‌గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పీపీ హేమలత నాయుడు వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 7 నెలల 27 రోజులు జైలు శిక్ష విధించారు. పీపీకి కోర్టు కానిస్టేబుల్ సీహెచ్, రవికుమార్ సహకరించారు.