
ఆస్పత్రి భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చేపట్టిన 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన భవన నిర్మాణ ప్లానింగ్‌ను పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ డిపార్ట్‌మెంట్ వస్తుందో అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు చేసి మార్పుల కోసం టీఎస్‌ఎంఐడీసీకి ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు. ఆ తర్వాత హెచ్‌ఓడీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్‌కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తర్వాత నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు భవనాలు అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, దేవేందర్, ఈఈ జైపాల్ రెడ్డి, హెచ్‌ఓడీలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస సామర్థ్యాల సాధనలో భాగంగా పాఠశాలలు ప్రారంభమైన మొదటి 60 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పది రోజులకు ఒకసారి పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్షకు పరీక్షకు విద్యార్థి మార్కుల్లో పురోగతి కన్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లా వానాకాలం, యాసంగి సీజన్ లలో అత్యధికంగా వరి పంట సాగు చేసి రాష్ట్రానికి అన్నం పెట్టేలా ఎదిగిందన్నారు. అలాగే చదువులో కూడా జిల్లాను ఉన్నత స్థాయి కి చేర్చి మోడల్‌గా మార్చాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సెక్టోరియల్ అధికారి జనార్దన్, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్