
సాక్షి, చైన్నె : ఈ ఏడాది వేసవిలో భానుడు ప్రతాపాన్ని చూపించాడు. ఎండతోపాటు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల రాకతో శనివారం వాతావరణం కాస్త చల్లబడింది. ఆదివారం రాత్రి ఒక్క సారిగా వాతావరణం పూర్తిగా మారింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో చైన్నె, శివారులోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు గజగజ వణికిపోయాయి. ఒక్క రాత్రిలో 27 సంవత్సరాల అనంతరం జూన్‌లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
చక్కర్లు కొట్టిన విమానాలు
రాత్రంతా కురిసిన వర్షానికి విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం వేకువ జామున చైన్నె వైపుగా షార్జా, అబుదాబి, దుబాయ్, లండన్, దోహ, శ్రీలంక, సింగపూర్, మస్కట్ తదితర దేశాల నుంచి వచ్చిన పది విమానాలు ల్యాండింగ్ చేయలేని పరిస్థితిలో గాల్లో చక్కర్లు కొట్టాయి. వాతావరణం పూర్తిగా అనుకూలించక పోవడంతో వీటిని బెంగళూరుకు మళ్లించారు. అలాగే చైన్నె నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమానాల సేవలు కొన్ని గంటల పాటు ఆలస్యమయ్యాయి. ఉదయం వాతావరణం అనుకూలించిన తర్వాత బెంగళూరు నుంచి చైన్నె విమానాలు చేరుకున్నాయి.
లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం
కుండ పోత వర్షానికి నగర, శివారుల్లోని అనేక మార్గాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన వాళ్లు, వాహన చోదకులకు కష్టాలు తప్పలేదు. ఎంఎండీఏ, వ్యాసార్పాడి, గిండి, తిరువీనగర్, కోయంబేడు, పూందమల్లి హైరోడ్డు తదితర మార్గాలు, మెట్రో రైలు పనులు జరుగుతున్న రోడ్లపై నీరు ప్రవహించింది. అనేక చోట్ల సబ్ వేలలోకి నీరు చేరింది. కొన్నిచొట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చైన్నె కార్పొరేషన్ అధికారులు 4 వేల మంది సిబ్బందితో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చైన్నె, శివారుల్లో పూర్తి స్థాయిలో నిర్మించిన వర్షపు నీటి కాలువల ద్వారా నటిని గంటల వ్యవధిలోనే తొలగించారు. చైన్నె కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ సమీరన్ మాట్లాడుతూ చైన్నె కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని వివరించారు. 30 చోట్ల విరిగి పడ్డ చెట్లు, కొమ్మలను తొలగించారని తెలిపారు. 1913 ద్వారా చైన్నె కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
అధికారుల అప్రమత్తం
ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం మరింత ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శాఖమంత్రి కేకేఎస్‌ఎస్ ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఎళిలగంలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం అధికారులు వర్షపాతం, సహాయక చర్యలు, జలాశయాల్లోకి నీటి రాక తదితర అంశాలను పర్యవేక్షించి, ఆయా జిల్లాల్లోని ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఒక్క రాత్రిలోనే చైన్నె శివారులో మొత్తం సరాసరి 20.4 సె.మీ మేరకు వర్షం కురిసినట్టు ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లో వర్షాల దృష్ట్యా, ఆయా జిల్లా యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు.
ఈ విషయంగా మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ మీడియాతో మాట్లాడుతూ చైన్నెలోని అన్ని సబ్ వేలను పర్యవేక్షిస్తున్నామని, రెండు మూడు మినహా తక్కిన సబ్‌వేలలోకి నీరు చేరలేదని వివరించారు. అన్ని సబ్ వేలు, సొరంగ మార్గాలలో హైకెపాసిటీ మోటార్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో 169 సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. గిండి కత్తిపారా, ఆర్కాట్ రోడ్డుల్లో నిలిచిన నీటిని గంటల వ్యవధిలో తొలగించామన్నారు. 13 జిల్లాలో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో, ఆయా జిల్లాల అధికారులను మరింత అలర్ట్ చేశామన్నారు. వర్ష ప్రభావితానికి గురయ్యే ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించామన్నారు. అత్యవసర సేవలకు 1070, 1077 టోల్‌ఫ్రీం నంబర్లు, వాట్సాప్ నంబరు 94458 69848ను సంప్రదించవచ్చునని సూచించారు.
రైలు ప్రయాణికులకు తప్పని అవస్థలు
చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని వ్యాసార్పాడి – బేసిన్ బ్రిడ్జి వంతెన కింది భాగంలో వర్షపు నీరు చేరడంతో పగుళ్లకు ఆస్కారం ఉందన్న సమాచారంతోపాటు సిగ్నలింగ్ సమస్య రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరాల్సిన, రావాల్సిన రైళ్లను ఆవడి, తిరువళ్లూరు, బీచ్ స్టేషన్లకు పరిమితం చేశారు. ఇక్కడి ఉంచి ఈ రైళ్లు పట్టాలెక్కాయి. ఇందులో కోయంబత్తూరు ఇంటర్ సిటీ, ముంబై ఎక్ ప్రెస్, కోయంబత్తూరు వందే భారత్, తిరుపతి ఎక్స్‌ప్రెస్ తదితర 7 రైళ్లు ఉన్నాయి. చైన్నెకు వచ్చిన శతాబ్ది రైలును సిగ్నలింగ్ సమస్యతో ఆవడికి పరిమితం చేశారు.
మరో మూడు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశలో పయనిస్తుండడంతో మరో మూడు రోజులు చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బాలచంద్రన్ తెలిపారు. కళ్లకురిచ్చి, మైలాడుతురై, డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని తిరువణ్ణామలై, రాణిపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మీనంబాక్కంలో 16 సె.మీ, తరమణి, ఆలందూరులో 14 సె.మీ, చెంబరంబాక్కంలో 13 సె.మీ, అన్నా వర్సిటీ, డీజీపీ కార్యాలయం పరిసరాలలో 10 సె.మీ, తాంబరం, కుండ్రత్తూరు, నుంగంబాక్కంలలో 9 సె.మీ, కొరట్టూరు, ఎంజీఆర్ నగర్ పరిసరాల్లో 8 సె.మీ వర్షం పడింది. 27 సంవత్సరాల అనంతరం చైన్నె, శివారులలో జూన్ నెలలు ఒక్క రాత్రి అతి భారీ వర్షం కురిసినట్టు వాతావరణ పరిశోధకులు వివరించారు. సముద్రంలో గాలి ప్రభావం 45 నుంచి 65 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment