చైన్నెలో పాదచారులు, వాహనదారుల ఇక్కట్లు
కలెక్టర్లతో సీఎం సమీక్ష
ఉపరితల ఆవర్తన ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు, డెల్టా, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో సీఎం స్టాలిన్ కలెక్టర్లతో పరిస్థితిపై చర్చించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలను సిద్ధం చేయాలని సూచించారు. ఇక విపత్తుల నిర్వహణ శాఖమంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ పర్యవేక్షణలో అత్యవసర కంట్రోల్ రూమ్ చైన్నెలో ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు ఎస్. ప్రభాకర్, సీఏ రామన్ తదితర అధికారులు ఈ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. కాగా భారీ వర్షాలకు తిరువారూర్ జిల్లా నన్నిలం ఒత్త వీడు గ్రామంలో ఇంటి గోడ కూలి ఓ బాలిక దుర్మరణం చెందింది.
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏడు జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు వరుణ బీభత్సం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల సీజన్ ముగింపు దశకు చేరిన విషయం తెలిసిందే. గత నెల మిచాంగ్ తుపాన్ కారణంగా చైన్నె, శివారు జిల్లాలు, వాయుగుండం కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలు వరద విలయంలో చిక్కుకున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 45 సెం.మీ మేరకు వర్షం కురిసింది. ఈ పరిస్థితుల్లో నైరుతి బంగాళా ఖాతం –ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తమిళనాడులోని సముద్ర తీర జిల్లాలు, దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాలు ఉండగా, ఇందులో 35 జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుసున్నాయి.
పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల కారణంగా తిరువారూర్, నాగపట్నం, తంజావూరు, మైలాడుతురై, విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు జిల్లాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విల్లుపురంలో కురిసిన వర్షాలకు వందలాది ఎకరాల వరి పంటను వరద నీరు ముంచేసింది. కడలూరు జిల్లా చిదంబరం పరిసరాలు, తిరువారూర్ జిల్లా నన్నిలం, మన్నార్‌కుడి, ముత్తుపేట, తిరువారూర్ నగరం, పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో అక్కడి ప్రజలకు అవస్థలు తప్పలేదు. తిరువారూర్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగాయి. విజయపురంలోని ప్రసూతి ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరడంతో 50 మంది గర్భిణులను హుటాహుటిన తిరువారూర్ జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా సెయ్యూరు చెరువు తెగడంతో అక్కడి ఏరియా ఆస్పత్రిలోకి వరదనీరు చేరింది. దీంతో రోగులను ఓ పాఠశాల భవనంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మైలాడుతురై వైదీశ్వరన్ ఆలయం జలమయం అయ్యింది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీటిని యుద్ధ ప్రాతిపదికన ఆయా జిల్లా అధికార యంత్రాంగం తొలగిస్తోంది. డెల్టా జిల్లాల్లో 25 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మైలాడుతురై జిల్లాలో 13.18 సెం.మీ, నాగపట్నంలో 11.92 సెం.మీ, తిరువారూర్‌లో 10.13 సెం.మీ, కడలూరులో 9.43 సెం.మీ, చెంగల్పట్టులో 7.43 సెం.మీ, విల్లుపురం జిల్లాలో 7.29 సెం.మీ వర్షం పడింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా మైలాడుతురై జిల్లా సిర్గాలిలో 23.6 సెం.మీ, కడలూరు జిల్లా చిదంబరంలో 22.9 సెం.మీ, నాగపట్నం జిల్లా వేలాంకన్ని 21.6 సెం.మీ, తిరువారూర్ జిల్లా నన్నిలో 20 సెం.మీ వర్షం పడింది. ఇక చైన్నె, శివారులలోనూ రాత్రంతా ముసురు వర్షం పడింది. దీంతో 24 అడుగులతో కూడిన చెంబారంబాక్కం రిజర్వాయర్‌లోకి నీటి మట్టం 22 అడుగులకు చేరింది. దీంతో ఉబరి నీటిని అడయార్ నదిలోకి విడుదల చేస్తున్నారు. మరింతగా వర్షాలు కొనసాగనున్న దృష్ట్యా, ఈ రిజర్వాయర్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే అడయార్ నదీ తీరంలోని చైన్నె నగరంలోని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చైన్నెలో వర్షంతో నందనం వైఎంసీఏ మైదానం తడిసి ముద్దయ్యింది. దీంతో మంగళవారం బుక్ ఫెయిర్‌కు సెలవు ప్రకటించారు. దక్షిణ తమిళానాడులో వర్షాలతో వైగై నది నిండుకుండగా మారింది. ఉబరి నీటి విడుదలతో మదురై, దిండుగల్, శివగంగై, రామనాథపురం, జిల్లాల్లోని వైగై నదీ తీర వాసులకు అలర్ట్ ప్రకటించారు.
ఐదు రోజుల పాటు..
రాష్ట్రంలో వర్షాలు మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాల చంద్రన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో ఇప్పటి వరకు 45 సెం.మీ వర్షం పడిందని, ఇది గత ఏడాది కంటే 4 శాతం ఎక్కువ అని వివరించారు. గడిచిన 24 గంటలలో ఐదు చోట్ల భారీగా, 17 చోట అతి భారీగా, 57 చోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు. బుధవారం ఉత్తర తమిళనాడు, డెల్టా జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. తమిళనాడు సముద్ర తీరం, మన్నార్ వలిగుడా, కుమరి సముద్ర తీరాలలో గంటకు 50 కి.మీ వేగంతో గాలి ప్రభావం ఉంటుందని జాలర్లు వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు. 12వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని తెలిపారు.
మరో 28 జిల్లాల్లో మోస్తరుగా.. చైన్నె, శివారు ప్రాంతాల్లో
ముసురు వర్షం
చైన్నెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment