రాయబారమా..?
● అమిత్ షాతో భేటీ?
● అన్నాడీఎంకే తీరుపై కొత్త చర్చ
సాక్షి, చైన్నె: బీజేపీకి దగ్గరయ్యే దిశగా అన్నాడీఎంకే చాప కింద నీరులా ప్రయత్నాలలో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వారసుడు మిథున్ బేటీ జరిగినట్టు చర్చ జోరందుకుంది. వివరాలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా బీజేపీ ఎన్‌డీఏ కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ఎన్నికల సమయానికి బయటకు వచ్చింది. తమ దివంగత నేత జయలలితను, తనను, తన పార్టీ వర్గాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా పళణి స్వామి ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలలో అన్నాడీఎంకే డిపాజిట్లు గల్లంతైనా, ఓటింగ్ శాతం కొంత మేరకు పెరగడం కాస్త ఊరట. ఈ పరిస్థితులో 2026 అసెంబ్లీ ఎన్నికలలోనే కాదు, భవిష్యత్తులోనూ బీజేపీతోపొత్తు ప్రసక్తే లేదని అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. అదే సమయంలో అన్నామలై తీరుపై బీజేపీ వర్గాలు తమ పెద్దలకు ఫిర్యాదులు సైతం చేసి ఉన్నారు. ఈ పరిస్థితులలో అధ్యక్ష మార్పు సమయంలో తనకు ఎక్కడ నష్టం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉన్న అన్నామలై వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ జరుగుతోంది. పళణి స్వామిని గానీ, అన్నాడీఎంకే వర్గాలను గానీ తాను పల్లెత్తి మాట అనబోనని ముఖ్య నేతల వద్ద స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయలో బీజేపీ శాసనసభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ ఓ కార్యక్రమంలో అన్నాడీఎంకే కలిసి మాట్లాడితే పొత్తు కుదిరినట్టే అని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ – అన్నాడీఎంకేలను కలిపే దిశగా తన మిత్రుల ద్వారా అన్నామలై కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు చర్చ జరుగుతోంది.
వారసుడి ద్వారా రాయబారమా?
తన మిత్రులతో సన్నిహితంగా ఉండే పళణిస్వామి తనయుడు మిథున్ ద్వారా రాయబారం అన్నామలై జరిపినట్టు సమాచారం. తన పదవిని కాపాడుకోవడమే కాకుండా, అన్నాడీఎంకే మళ్లీ కూటమిలోకి చేర్చే బాధ్యతగా మిదున్ ద్వారా రాయబారం జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇటీవల అన్నామలైతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మిథున్ కలిసినట్టు వెలువడ్డ సమాచారాలు కొత్త చర్చకు దారి తీశాయి. అయితే, దీనిని అన్నాడీఎంకే వర్గాలు దృవీకరించడం లేదు. ఇవన్నీ కేవలం రాజకీయ ప్రచారాలేనని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, ఈ నెలాఖరులో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టాల్సిన పళణి స్వామి వాయిదా వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఫిబ్రవరిలో ప్రచార పర్యటన మొదలెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.అదే సమయంలో 2026 ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కమిటీలు ఇటీవల కాలంగా చేసిన పర్యటన ముగిసింది. మండల, పురపాలక, నగర స్థాయిలో ఈ కమిటీలు పర్యటించి పార్టీ వర్గాలు, అనుబంధ విభాగాలతో సమీక్షించాయి. వారి అభిప్రాయాలను స్వీకరించాయి. వీటన్నింటిపై ఫిబ్రవరి 4వ తేదిన పళణి స్వామి చైన్నెలో సమావేశం కానుండడం గమనించ దగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment