హైదరాబాద్: ధ్యానం, జ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ఒత్తిడిని తొలగించి ప్రపంచ శాంతిని తేవటమే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యమని స్వామి సూర్యపాద పేర్కొన్నారు. 10వ తేదీ శనివారం సాయంత్రం కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సత్సంగానికి వందలాది భక్తులు హాజరయ్యారు.
సాయంత్రం 6.30 గంటలకు ఓంకారం, గణేశస్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. శక్తి, యుక్తి, భక్తిల కలయికగా హనుమంతుని స్తుతించిన స్వామీజీ, ప్రశాంతత, ధైర్యం, విశ్వాసం సమపాళ్లలో కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానాంజనేయస్వామి నుండి మనం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ, కృష్ణ, సరస్వతీ దేవతలను, సద్గురువును స్తుతిస్తూ సాగిన స్వామీజీ సుమథుర గానంతో భక్తులందరూ గొంతు కలిపారు. ప్రతీ భజన అనంతరం కొద్ది సేపు భక్తులందరితో చేయించిన ధ్యానం వారికి అలౌకికానుభూతిని కలిగించింది.
స్వామి సూర్యపాద గారు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవుల స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ, జ్ఞాన, ధ్యాన కార్యక్రమాలను ప్రజలకు నేర్పుతున్నారు. భక్తిపూర్వకమైన హృదయంతో వారు సత్సంగాలలో పాడే భజనలు, వాటికి తోడుగా చేసే ఉపదేశ వాక్యాలు బహుళ జనాదరణ పొందటమే కాక, ప్రజల్లో చక్కని పరివర్తనను కలిగించేందుకు, వారిని మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయి.
పూర్వం లక్ష్మీదేవి పల్లెగా పేరొందిన కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి గోల్కొండ కోటను జయించి చుట్టుపక్కల హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ పల్లెకు వచ్చి, అక్కడి ధ్యానాంజనేయస్వామి మూర్తిని చూసి నిరుత్తరుడై నిలిచిపోగా, ఈ మూర్తిని దర్శించాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలని చెబుతూ ఆలయ పూజారి 'కరో మన్ ఘట్' అని అన్న మాటతో, ఆ ఆలయానికి హాని చేయకుండా ఖిల్జీ మరలిపోయాడని, ఆనాటి నుంచి ఆ ప్రాంతం కరో మన్ ఘట్ లేదా కర్మన్ ఘాట్‌గా పేరు తెచ్చుకుందని చెబుతారు.
ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధ్యానాంజనేయస్వామి ప్రాంగణంలో జరిగిన ఈ మహా సత్సంగం భక్తుల హృదయాల్లో మధురానుభూతులను మిగిల్చి, ఈ ప్రాంతమంతటికీ సకల శుభాలను కలిగించినదనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యులు రామ్‌కుమార్ రాఠీ, కృష్ణమూర్తి, కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, రోహన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment