సాక్షి, ఖమ్మం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసింది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్రలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..108 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. సొంత జిల్లా అయిన ఖమ్మంలో శనివారంతో ముగిసింది. జూలై 2న జరగబోయే కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారు.
కాగా 108 రోజుల భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్‌లో సరికొత్త ఊపు తీసుకువచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెద్దఎత్తున యువతకులు, మహిళలు పాల్గొన్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడడంతోపాటు ఇతర పార్టీల నాయకులు చెయ్యి అందుకోవడానికి సిద్ధమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జనలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండటమే ఇందుకు నిదర్శనం.
చదవండి: నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment