సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ | Free for government school children | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ

Published Fri, Jun 16 2023 4:33 AM | Last Updated on Fri, Jun 16 2023 4:33 AM

Free for government school children - Sakshi

సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి భవన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ కుమార్‌ సమ్రేశ్‌ వెల్లడించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సందర్శనకు అనుమతిస్తూ, ఆ మేరకు మార్చి 22 నుంచి సందర్శనకు అవకాశం కలి్పస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఈనెల 14 వరకు రాష్ట్రపతి నిలయాన్ని దాదాపు 10 వేల మంది సందర్శకులు దర్శించారని పీఆర్‌ఓ సమ్రేశ్‌ తెలిపారు. రాష్ట్రపతి నిలయ సందర్శన సమాచారాన్ని ప్రజల్లోకి  మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో గురువారం రాష్ట్రపతి నిలయంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో తీసుకువచ్చిన మార్పులు, బుకింగ్‌ తదితర వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్‌ డా.కె రజనీప్రియతో కలిసి ఆయన వెల్లడించారు. 

డిసెంబర్‌ మినహా ఏడాది పొడవునా.. 
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన జరిగే డిసెంబర్‌ నెల మినహా ఏడాది పొడవునా సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఏ రోజైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ కోసం  http:// visit.rashtrapatibhavan.gov.in  వెబ్‌సైట్‌లో లేదంటే నేరుగా రాష్ట్రపతి నిలయానికి వచ్చి అక్కడి రిసెప్షన్‌ సెంటర్‌లోనూ టికెట్‌ తీసుకోవచ్చన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని, మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల బృందం 30 మందికి పైగా ఉంటే వారికి టికెట్‌ రుసుంలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. సందర్శకులకు రాష్ట్రపతి నిలయంలోని విశేషాలను వివరించేందుకు 20 మంది గైడ్లను ప్రత్యేకంగా నియమించినట్టు వారు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement