బేగంబజార్‌లో గజం ధర రూ.10 లక్షలు
తాజాగా రూ.10 కోట్లు పలికిన 101 గజాల స్థలం
రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లకు కేరాఫ్ అడ్రస్
దుకాణాలకు అవసరమైన స్థలాలకు ఉత్తరాది వ్యాపారుల పోటీ
హోల్‌సేల్ మార్కెట్లకు కేంద్రమైన బేగంబజార్ స్థల యజమానులకు మాత్రం గోల్డెన్ బజార్‌గా మారింది. కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికితేనే అంతా ఆశ్చర్యపోయారు. కానీ తాజాగా పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగంబజార్ ఫీల్‌ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.
– అబిడ్స్ (హైదరాబాద్)
ఎందుకింత డిమాండ్?
తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్. వాణిజ్య మార్కెట్‌లో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పోటీపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారస్తులు బేగంబజార్‌లో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 5–6 వేల హోల్‌సేల్ దుకాణాలుంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది రిటైల్ వ్యాపారస్తులు వస్తుంటారు. దీంతో కొత్తగా మౌలిక వసతుల అభివృద్ధి లేకపోయినప్పటికీ దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది.
కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఎక్కడైనా కొద్దిపాటి స్థలం అందుబాటులో ఉంటే పదుల సంఖ్యలో వ్యాపారస్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఏ గల్లీలో అయినా స్థల యజమానులకు కాసుల వర్షం కురుస్తోంది. కొనుగోలుదారుల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా భూ యజమానులు రాత్రికి రాత్రే ధరలను పెంచేస్తున్నారు. అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు భూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment