కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.
మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ప్రమాదంపై పోలీసుల ఆరా..
చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తలకొరివి పెట్టిన తనయ
చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment