Telangana: జీతాలు పెరిగాయ్‌ | 9.21 Lakh Telangana Government Employees To Get Benefits | Sakshi
Sakshi News home page

Telangana: జీతాలు పెరిగాయ్‌

Published Sat, Jun 12 2021 2:25 AM | Last Updated on Sat, Jun 12 2021 4:45 PM

9.21 Lakh Telangana Government Employees To Get Benefits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతనాల పెంపు అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పీఆర్సీ అమలుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 9.21 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు ఇది ప్రయోజనం కలిగించనుంది.
 

కేబినెట్‌ ఆమోదంతో పీఆర్సీ నివేదికను జీవో 51గా.. ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర సిబ్బంది ప్రయోజనాలకు సంబంధించి 52 నుంచి 60 వరకు నంబర్లపై జీవోలను ఆర్థిక శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 2018 జూలై 1 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని.. 2020 మార్చి 31వ నోషనల్‌గా, 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలు నగదు ప్రయోజనాలుగా ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అందజేస్తామని ప్రకటించింది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సొమ్మును చెల్లిస్తుంది. ఏప్రిల్, మే నెలల వేతన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని.. జూన్‌ నెల నుంచి కొత్త వేతనాలను నగదు రూపంలో చెల్లిస్తామని వివరించింది.  పీఆర్సీ ఉత్తర్వుల జారీ పట్ల పీఆర్టీయూ–టీఎస్, యూటీఎఫ్, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం నేతలు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, జంగయ్య, చావ రవి, పి.మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


కనీస వేతనం రూ.19 వేలు 
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.19 వేలుగా, గరిష్ట మూల వేతనం రూ.1,62,070గా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మాస్టర్‌ పేస్కేల్‌ను సవరించింది. దీనిలో 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను పేర్కొంది. 


అదనపు డీఏ, అలవెన్సులు కలిపి కొత్త వేతనం 
2018 జూలై 1 నాటికి ఉన్న డీఏను తాజా ఫిట్‌మెంట్‌లో కలిపి కొత్త వేతనాలను నిర్ణయించింది. తర్వాత ప్రకటించిన డీఏ ఇప్పుడు కొత్త వేతనంతో కలిపి వస్తుంది. అంటే కొత్త మూల వేతనంతోపాటు అదనపు డీఏ 7.28 శాతం, ప్రాంతాన్ని బట్టి హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కలిపి కొత్త వేతనాలను చెల్లిస్తుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3 డీఏలు బాకీ ఉంది. 2020 జనవరి, జూలై, 2021 జనవరి డీఏ కూడా రావాల్సి ఉంది. ప్రతి కేటగిరీలో గరిష్ట మూల వేతనం దాటితే వారికి రెగ్యులర్‌ ఇంక్రిమెంట్‌ ఉండదు. అలాంటి వారికి టైం స్కేల్‌తో సంబంధం లేకుండా అన్ని గ్రేడ్లలో గరిష్టంగా ఐదేళ్లలో ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను మంజూరు చేసింది. 


పీఆర్సీ వర్తించేది వీటికే.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గత పీఆర్సీ వర్తించిన స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులకు తాజా పీఆర్సీ ఉత్తర్వులు వర్తిస్తాయి. హైకోర్టు ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసేందుకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంఘాల ఉద్యోగులకు పీఆర్సీపై సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయి. 


వీరికి పీఆర్సీ వర్తించదు 
యూజీసీ, ఐసీఏఆర్, ఏఐసీటీఈ పేస్కేళ్లు పొందే ప్రభుత్వ కాలేజీల్లోని బోధనా సిబ్బందికి, ఎయిడెడ్‌ కాలేజీల సిబ్బందికి పీఆర్సీ ఉత్తర్వులు వర్తించవు. నేషనల్‌ ఫస్ట్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన పేస్కేళ్లు పొందుతున్న వారికి కూడా వర్తించవు. 2018 జూలై 1 కంటే ముందు రీఎంప్లాయ్‌మెంట్‌ పొందినవారు, ఇండస్ట్రియల్‌ విభాగాల్లోని కంటింజెంట్‌ ఉద్యోగులకు వర్తించవు. 


హెచ్‌ఆర్‌ఏపై సీలింగ్‌ ఎత్తివేత 
కేంద్ర ఏడో పీఆర్సీ సూచనల ప్రకారం రాష్ట్రంలో ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ)లను తగ్గించినా.. దీనిపై ఉన్న సీలింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇప్పటివరకు ప్రాంతాన్ని బట్టి హెచ్‌ఆర్‌ఏ 30%, 20%, 14.5%, 12 శాతాలుగా ఉండగా.. వాటిని 24%, 17%,13%, 11 శాతాలకు తగ్గించింది. నగరాలు, పట్టణాల వర్గీకరణను 2011 జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయించింది. ప్రాజెక్టులు, ఏజెన్సీ ప్రాంతాల్లో గృహవసతి కల్పించలేని సందర్భంలో రూ.2,500 గరిష్ట పరిమితితో 8% అదనపు ఇంటి అద్దె చెల్లించేలా చర్యలు చేపట్టింది. 


కాంట్రాక్టు ఉద్యోగుల వేతనం ‘ఫిక్స్‌’ 
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్న హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు కేటగిరీ 1, 2, 3ల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తూ వారి వేతనాన్ని 30 శాతం పెంచింది. కేటగిరీ–1 (ఆఫీస్‌ సబార్డినేట్స్‌)కు రూ.15,600, కేటగిరీ–2 ఉద్యోగులు (జూనియర్‌ అసిస్టెంట్స్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్లు)కు రూ.19,500, కేటగిరీ–3 కింద (ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్లు) రూ.22,750గా వేతనాన్ని నిర్ధారించింది. 2008 నవంబర్‌ 1 నాటి జీవో ప్రకారం పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని జీవోలో వెల్లడించింది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలోని 1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 


పెన్షనర్లకు కనీస వేతసం రూ.9,500 
రిటైర్డ్‌ ఉద్యోగులు/కుటుంబ పెన్షనర్లకు అందే కనీస పెన్షన్‌ను రూ.9,500గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కనీస పెన్షన్‌ను డీఏతో సంబంధం లేకుండా చెల్లిస్తారు. డీఏ పెరిగిన కొద్దీ అదనంగా కలుస్తుంది. పెన్షనర్లకు ఫిట్‌మెంట్‌ బకాయిలను 36 వాయిదాల్లో చెల్లిస్తారు. ఇక పెన్షనర్ల నెలసరి మెడికల్‌ అలవెన్సును రూ.350 నుంచి రూ.600కు పెంచింది. 


గరిష్ట గ్రాట్యుటీ రూ.16 లక్షలు 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన తర్వాత వచ్చే గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. పెంచిన గ్రాట్యుటీ 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని పేర్కొన్నా 2021 జూన్‌ నుంచి నేరుగా అందిస్తారు. ముందటి బకాయిలను 36 వాయిదాల్లో చెల్లిస్తారు. 


సీపీఎస్‌కు కాస్త ‘ఊరట’ 
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. సదరు ఉద్యోగులు ఇన్‌సర్వీస్‌లో మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు పెన్షన్‌ రూల్స్‌– 1980 కింద పాత పెన్షన్‌ విధానంలో ఫ్యామిలీ పెన్షన్‌ ఇవ్వనున్నారు. 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియమితులైన సుమారు 1.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు దీనితో లబ్ధి చేకూరనుంది. 

నెలకు అదనపు ఖర్చు రూ. 750 కోట్లు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేస్తే ఎంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందన్న అంచనాలపై ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలు వేసింది. నిత్యావసర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచడమే ఫిట్‌మెంట్‌. దాన్ని 30 శాతంతో అమలు చేసేందుకు ప్రభు త్వం గతంలోనే ఆమోదం తెలిపిన నేపథ్యం లో 1 శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.300 కో ట్లు వెచించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అంచ నా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా చూస్తే 5.29 లక్షల మందికి వేతన సవరణను అమలు చేస్తే ఏటా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. అంటే నెలకు రూ.750 కోట్లు అదనంగా ప్రభుత్వం వెచ్చించాల్సి రానుంది. మరోవైపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలను పెంచితే ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం పెరగనుంది. మరోవైపు కొత్తగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తే ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ. 1000 కోట్లకుపైగా ఆర్థిక భారం పడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement