కోకాకోలా రూ.647 కోట్ల అదనపు పెట్టుబడి  | An additional investment of Rs 647 crore by Coca Cola | Sakshi
Sakshi News home page

కోకాకోలా రూ.647 కోట్ల అదనపు పెట్టుబడి 

Published Sun, Aug 27 2023 1:38 AM | Last Updated on Sun, Aug 27 2023 10:02 AM

An additional investment of Rs 647 crore by Coca Cola - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాలో కోకాకోలా సంస్థ నిర్మిస్తున్న కొత్త బాట్లింగ్‌ ప్లాంట్‌లో మరో రూ.647 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నామని సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మేక్‌గ్రివి ప్రకటించారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ నిర్మాణం కోసం గత ఏప్రిల్‌ 22న రాష్ట్ర ప్రభుత్వంతో కోకాకోలా సంస్థ ఎంఓయూ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్లాంట్‌ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యా పార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేమ్స్‌ వెల్లడించారు.

ఈ ప్లాంట్‌ డిసెంబర్‌ 24 నాటికి పూర్తి కానుందని తెలిపారు. తమకు ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌ భారతదేశం అని, ఇక్కడ తమ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో శనివారం న్యూయార్క్‌లో సమా వేశమై ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను తెలియజేశారు. 

తెలంగాణలో కోకాకోలా పెట్టుబడులు రెట్టింపు: రాష్ట్రంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేయనున్నామని జేమ్స్‌ మేక్‌గ్రివి ఈ సందర్భంగా వెల్లడించారు. అమీన్‌పూర్‌లోని తమ బాట్లింగ్‌ ప్లాంట్‌ విస్తరణకు గతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

కరీంనగర్, వరంగల్‌ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిపాదిత నూతన ప్లాంట్‌నూ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రూ.2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని తెలియజేశారు. ఇటీవల కాలంలో అత్యంత తక్కువ సమయంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. 

భారీ పెట్టుబడులకు ఇదే సాక్ష్యం: రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తు న్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఐటీ, అనుబంధ రంగాలు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌/ అనుబంధ రంగాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగా ల్లో భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందన్నారు.

కోకాకోలా రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు ని ర్ణయం తీసుకోవడం పట్ల సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రతిపాదించిన రెండో తయారీ కేంద్రానికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.  

పలువురు సీఈవోలు, ప్రతినిధులు, విద్యావేత్తలతో కేటీఆర్‌ భేటీ 
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం షికాగోలో వేర్వేరు భేటీల్లో పాల్గొన్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలు, విద్యావేత్త లు, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఈ భేటీల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాల అన్వేషణపై మాట్లా డారు.

వైద్య ఉపకరణాలు, కృత్రిమ మేధస్సులో అగ్రగామిగా ఉన్న అలైవ్‌ కోర్‌ బృందంతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో మెడ్‌ టెక్‌ రంగంలో కలిసి పని చేసేందుకు అలైవ్‌ కోర్‌ కు చెందిన ఈసీజీ టెక్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. అట్లాంటాకు చెందిన హెల్త్‌ టెక్‌ కంపెనీ సీఈఓ క్యారలోన్, అధ్యక్షుడు రజత్‌ పూరీ కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా క్యారలోన్‌ను కోరారు. 

ఏడీఎం విస్తరిస్తే సహకరిస్తాం: కేటీఆర్‌
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ రంగంలో పేరొందిన ఆర్చర్‌ డేనియల్స్‌ మిడ్‌ లాండ్‌ (ఏడీఎం) సీఈవో విక్రం లూథర్‌ కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణలో ఏడీఎం కార్యకలాపాలు విస్తరిస్తే తాము సహకరిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఇల్లినాయిస్‌ స్టేట్‌ ఫస్ట్‌ అసిస్టెంట్‌ డిప్యూ టీ గవర్నర్‌ క్రిష్టి జార్జ్, కామర్స్‌ సెక్రెటరీ క్రిస్టిన్‌ రిచర్డ్స్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. క్లీన్‌ టెక్, సుస్థిర మొబిలిటీ, లైఫ్‌ సైన్సెస్, వైమానిక, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.

చికాగో బూత్‌ స్కూల్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మాధవ రంజన్‌ కూడా కేటీఆర్‌ను కలిశారు. హైదరాబాదులో పరిశోధన, ఐఎస్‌బీ తరహా విద్యాసంస్థల ఏర్పాటు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రావలసిందిగా ప్రొఫెసర్‌ మాధవ్‌ రంజన్‌ను ఆ హ్వానించారు. షికాగోలో భారత్‌ కాన్సుల్‌ జనరల్‌ సోమ నాథ్‌ ఘోష్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement