
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రైతుబీమా పథకం కింద ఆగస్టు 3వ తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులు, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా కలిగి ఉన్న రైతుల డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
డేటాలోని 18–59 ఏళ్ల మధ్య వయసు గల రైతులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలలో భూమిని కలిగి ఉన్నప్పటికీ ఒక రైతు ఒకే చోట నమోదుకు అర్హులని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రైతుబీమా కింద మొత్తం 35.64 లక్షలమంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.