సాక్షి, హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అప్పటివరకు జాగ్రత్తలు పాటిస్తే మార్చి నుంచి ఎలాంటి సమస్య ఉండదన్నారు.
ఈ మేరకు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి మహమ్మారి (పాండెమిక్) దశ నుంచి స్థానికంగా సోకే (ఎండెమిక్) వ్యాధి దశకు తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే అది కొన్ని దేశాల్లోనే వెలుగుచూస్తోందని, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని పాటించారని... సుమారు 70 శాతం మందికి టీకాలు వేయలేదని... వ్యాక్సినేషన్‌లో చైనా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు పాటి స్తే సురక్షితంగా ఉండొచ్చన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో ప్రజలు మాస్క్‌లు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. దేశంలో కేవలం 28 శాతం మందే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలినవారు వెంటనే తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్ తీసుకోవాలని, ఏడాదైనా పరవాలేదని.. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. వరుసగా మూడేళ్లపాటు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్నారు.
బీఎఫ్–7 ప్రమాదకరం కాదు...
‘దేశంలో ఒమిక్రాన్ రకానికి చెందిన ఎక్స్‌బీబీ వైరస్ 80 శాతం ఉంది. బీఎఫ్–7 వేరియంట్ అక్టోబర్‌లోనే భారత్‌లోకి వచ్చింది. కానీ 10 కేసులే నమోదయ్యాయి. అది పెద్దగా మనపై ప్రభావం చూపలేదు. హైదరాబాద్‌లో ఎక్స్‌బీబీ వైరస్ కేసులు 60 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్‌లో బీఎఫ్–7 కేసులు ఎక్కువగా ఉన్నాయి. బీఫ్–7 వైరస్ ఒకరికి వస్తే వారి ద్వారా 10 మందికి వ్యాపిస్తుంది.
అదే ఒమిక్రాన్ ఒకరికి వస్తే ఐదుగురికి వ్యాపిస్తుంది. బీఎఫ్–7 డెల్టా అంత ప్రమాదకరమైంది కాదు. బీఎఫ్–7 రకం వైరస్ గొంతు, నోటి వరకే వెళ్తుంది. రోగనిరోధకశక్తి తక్కువున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ వెళ్లే ప్రమాదముంది. వారికి సీరియస్ అయ్యే అవకాశముంది’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్...
‘దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. రెండు కోవాగ్జిన్... ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. మూడోది కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్. ఇది పెపిటైట్ ఆధారిత టీకా. ఈ ఏడాది జనవరిలోనే కార్బెవ్యాక్స్ వచ్చింది. జూన్‌లో దానికి బూస్టర్‌గా అనుమతి లభించింది. కార్బెవ్యాక్స్ చాలా సురక్షితమైనది.
వ్యాక్సిన్లను దశలవారీగా వేర్వేరు కంపెనీలవి వేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ వేసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనిపై మేం అధ్యయనం చేశాం. కార్బెవ్యాక్స్ 95 శాతం సామర్థ్యంతో కూడినది. దీన్ని వేసుకుంటే కరోనా గురించి మనం మరిచిపోవచ్చు. ఇతర వ్యాక్సిన్లతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment