సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు.
తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment