సాక్షి, హైదరాబాద్: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండీఏ, సర్వే డిపార్ట్‌మెంట్లలో పనిచేసిన ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.
క్రిమినల్ చర్యల లిస్టులో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీవో, బాచుపల్లి ఎమ్మార్వో, మేడ్చల్ మల్కాజ్‌గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఆఫ్ ఎడి ఉన్నట్లు సమాచారం.
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.
నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్‌సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.
దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment