భైంసా, నారాయణఖేడ్: బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ–1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ గతనెల 31న బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాడు. నాలుగు రోజులుగా నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
పీయూసీ–1లో అడ్మిషన్ పొందిన జాదవ్ బబ్లూ తరగతులకు హాజరైన రెండోరోజే హాస్టల్ బ్లాక్‌లో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. కాగా ట్రిపుల్‌ఐటీలో రెండు నెలల క్రితం జూన్ 14న సిద్దిపేట జిల్లాకు చెందిన బోర లిఖిత అనే విద్యారి్థని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగిన కొద్దిసేపటికే
‘‘నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగాడు.. కొద్ది సేపటికే మీ బిడ్డ చనిపోయాడని కళాశాల నుంచి పిడుగులాంటి వార్త విని గుండె పగిలినంత పని అయింది’అని జాదవ్ బబ్లూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డ చక్కగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనుకుంటే గర్భశోకం మిగిల్చాడని భోరుమని విలపించారు. ఇలా ఎందుకు చేశాడో తెలియదని విలపించారు.
కాంగ్రెస్ ఆందోళన..
ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లేందుకు యతి్నంచారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే బాసరలో 20మంది విద్యార్థులు చనిపోయారనీ, ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే పాలకులు స్పందిస్తారని కాంగ్రెస్ నియోజకవర్గ నేత కూచాడి శ్రీహరిరావు ప్రశ్నించారు.
విద్యార్థుల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాగా ట్రిపుల్ ఐటీ అధికారులు బబ్లూ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలని నినదించారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment