చూడ్డానికి మామూలు కళ్లద్దాల్లాగే కనిపిస్తున్నాయి కదూ.. ! అయితే.. వీటిని వేలం వేయనున్న సథబీస్ సంస్థ మాత్రం ఇలాంటివి ప్రపంచంలో మరెక్కడా లేవని చెబుతోంది.. ఏంటి విషయమని ఆరా తీస్తే.. వీటితో మనకున్న లింకు కూడా బయటపడింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ కళ్లద్దాలు.. మన దేశాన్ని పాలించిన మొఘలులకు చెందినవట. సాధారణంగా కళ్లద్దాల అద్దాలను గాజుతో చేస్తారు. వీటిని మాత్రం వజ్రం, పచ్చతో చేశారు. అది కూడా మన గోల్కొండ వజ్రాల గనిలో లభ్యమైన ఓ 200 క్యారెట్ల వజ్రం నుంచే వీటిల్లో ఒక అద్దాన్ని తయారుచేశారట.
మొఘలుల కాలం నాటి కళాకారుల పనితనానికి ఇదో మచ్చుతునకని సథబీస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని అప్పటి మొఘల్ చక్రవర్తి లేదా ఆయన దర్బారులో పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి ధరించి ఉండొచ్చని అంటున్నారు. జ్ఞానసిద్ధికి.. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి వీటిని ధరించేవారట! వచ్చే నెల్లో జరగనున్న వేలంలో ఇవి కనీసం రూ.25 కోట్లు పలుకుతాయని సథబీస్ సంస్థ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment