
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గంటలతరబడి వార్డులోనే మృతదేహం ఉండడంతో పేషంట్ల తో పాటు బంధువులు భయాందోళనకు గురయ్యారు. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన వ్యక్తి కరోనా బారినపడి కరీంనగర్ ఆస్పత్రిలో చేరారు. వైద్యం పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
కనీసం మార్చురీకి తరలించకుండా వార్డులోనే గంటల తరబడి మృతదేహాన్ని ఉంచడంతో పేషంట్లతో పాటు వారి బంధువులు భయాందోళన చెందారు. పేషెంట్లు, మృతుడి బంధువులు నిలదీస్తే అంబులెన్స్ లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఉదయం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని నాలుగు గంటలకు పైగా వార్డులో ఉంచడంతో, స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కరోనా ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది మృతదేహం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం సృష్టించింది. చివరకు అధికారులు జోక్యంతో హడావిడిగా వైద్య సిబ్బంది అప్రమత్తమై మృతదేహాన్ని బంధువులకు అప్పగించి తరలించారు.