‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్‌సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు.
చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
ఎలా చేస్తారంటే..
►స్పూఫింగ్ యాప్‌లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్‌లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్‌లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్‌కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు.
► బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్‌లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్‌డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు.
చదవండి: దేశమంతటా మన పథకాలే
సౌండ్ బాక్స్‌తో పరిష్కారం..
నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్‌తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్‌నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్‌లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment