సాక్షి, వరంగల్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం ఉదయం గండిపడింది. పోతననగర్‌వైపు చెరువు కోతకు గురైంది. దీంతో, చెరువులోని నీరు ఉధృతంగా కిందరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పోతననగర్, సరస్వతి నగర్ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, వర్షం లేకపోయినప్పటికీ భద్రకాళి చెరువుకు వరద నీరు భారీగా తరలివస్తోంది. దీంతోనే చెరువు కట్ట కోతకు గురైనట్టు తెలుస్తోంది.
ఇక, సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్ భద్రకాళి చెరువుకు గండిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. చెరువు కట్టను పరిశీలిస్తున్నారు. అనంతరం.. లోతట్టు ప్రాంతాల ప్రజలను కమిషనర్ అప్రమత్తం చేశారు. అనంతరం.. మున్సిపల్ డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఏసీపీ కిషన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకు బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పోతన నగర్, సరస్వతి నగర్, కాపువాడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: శాంతించిన మున్నేరు.. హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్
Comments
Please login to add a commentAdd a comment