సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ మహానగరం వెనిస్ నగరంలా తయారైందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానంటే.. తన కుమారుడు మంత్రి కేటీఆర్ విశ్వనగరంగా మార్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిప్డడారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పలు సందర్భాల్లో చెప్పారని, ఆ డబ్బంతా ఎక్కడ పోయిందని నిలదీశారు. టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని భట్టి పిలుపునిచ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. (హైదరా‘బాధలకు’ బాధ్యులెవరు?)
పాలమూరు ఎత్తిపోతల పంపులు అండర్ గ్రౌండ్‌లో వద్దని నిపుణుల కమిటీ వద్దని చెప్పిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ వినిపించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్విర్యం అయ్యిందని, ఏడేళ్ల కింద రిటైర్డ్ అయిన వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈఎన్సీ మురళీధర్ రావు వల్ల ఇరిగేషన్ భ్రష్టు పట్టిందన్నారు. మురళీధర్ రావుపై సీబీఐ చేత విచారణ జరిపితే బాగోతం బయటపడుతుందని డిమాండ్ చేశారు. కల్వకుర్తి పంపులను చూడనీయకుండా తమను ఎందుకు ఆపుతున్నారని, తాము ఖచ్చితంగా వెళ్లితీరుతామని విక్రమార్క స్పష్టం చేశారు.
నీటమునిగిన పంపుహౌజ్..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు ఎల్లూరు వద్ద పంపుహౌజ్ నీట మునిగింది. అయిదు మోటార్లు నీట మునగటంతో భారీ నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో వాటర్ లీకవ్వటంతో మోటార్లు మునిగాయని అధికారులు చెబుతున్నారు .ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టాన్నెల్ వద్ద జరుపుతున్న బ్లాస్టింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్ల నీటమునిగిన వ్యవహారం వివాదాస్పదమవుతుంది. సంఘటన స్ధలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షపార్టీల నేతలకు పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment