సాక్షి, కరీంనగర్: ‘నా దగ్గర వీడియోలు, ఆడియోలు ఉన్నయని జూలై 12న ఓ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిండు. ఇన్‌స్పెక్టర్ సార్ దగ్గరకు నన్ను పిలిపించి నా ఫోన్ కూడ ఫార్మాట్ చేయించిండు. ఇంకో ఫోన్ గుంజుకున్నడు’ ‘ఏసీపీ సార్ దగ్గరికి నేనే వెళ్లిన. గీ వీడియో ఉంది.. నన్ను ఇబ్బంది పెడుతున్నరు అని పోతే నాకు 5లక్షలు ఇస్త. ఒక ఫోన్ కొనిస్త అని చెప్పిండు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్‌లు ఉన్నయి’ బీజేపీ కరీంనగర్ జిల్లా ‘బాస’యిన ఓ వ్యక్తితో తన వ్యక్తిగత సంబంధాల గురించి ఓ మహిళా కార్యకర్త మీడియాలో చెప్పిన మాటలు ఇవి. రాజకీయ నాయకుల వ్యక్తిగత సంబంధాల వ్యవహారం సాధారణ ప్రజానీకానికి అవసరం లేకపోయినా.. ఆర్థికపరమైన సెటిల్‌మెంట్లలో పోలీసుల ప్రమేయం గురించి సదరు మహిళ వివరించిన తీరు చర్చనీయాంశమైంది. పార్టీ జిల్లా బాస్‌కు, మహిళకు చెడిన వ్యవహారంలో పోలీస్‌స్టేషన్, ఏసీపీల వద్దకు వెళితే... ఆర్థిక పరమైన సెటిల్‌మెంట్‌తో సమస్యను పరిష్కారం చేసుకోమని సూచించినట్లు లీకైన ఆడియో టేపులతోపాటు కొన్ని టీవీ ఛానెళ్ల ‘లైవ్’ టెలికాస్ట్‌ల ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వ్యవహారంలో పోలీసు అధికారులు తలదూర్చినట్లు మహిళ చెప్పిన మాటల్లో నిజమెంత..? ఒకవేళ నిజమైతే ఎవరి ప్రోద్బలంతో జోక్యం చేసుకున్నారనే దానిపై వివరణ కోరినట్లు తెలిసింది.
మసక బారిన పార్టీ నాయకుల నైతికత
క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే బీజేపీలో పనిచేసే కొందరు వ్యక్తుల నైతికతను దెబ్బతీసేలా సదరు మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు పార్టీ నేతలకు ఇబ్బందిగా తయారైంది. కరీంనగర్ పట్టణానికి చెందిన ముగ్గురు లీడర్ల పేర్లు చెబుతూ వారు సాగించిన వ్యవహారాలను బహిర్గతం చేయడంతో పార్టీలోని నేతలంతా తల పట్టుకుంటున్నారు. ఓ వైపు పార్టీ పిలుపిచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే.. పార్టీ నాయకుని వ్యక్తిగత వ్యవహారం రచ్చరచ్చగా మారి పార్టీ ప్రతిష్టకే ముప్పుగా పరిణమించడంతో నేతలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. సదరు మహిళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పైన విమర్శలకు దిగడాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయినా పార్టీ నైతికతకు ఇబ్బందిగా పరిణమించడంతో ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుండిపోతున్నారు.
ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్న బండి సంజయ్
తన సొంత జిల్లా కరీంనగర్‌లో చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఢిల్లీ నుంచే సమీక్షిస్తున్నారు. పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు. కాగా పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment