సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బోధన్/ బాన్సువాడ: ‘బలిసిందా నీది.. ఊరుకో బే బాడ్‌ఖావ్.. ఏం మాట్లాడుతున్నావు..’ అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఓ కిరాణా వ్యాపారిని బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరిగ్గా మాట్లాడండి’ అంటూ వ్యాపారి వారించినా వినకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో దూషణలకు దిగారు. డబ్బులు ఇచ్చానంటూ గద్దించారు. దీంతో మసీదు ఎక్కి ఆ మాట చెప్పాలని వ్యాపారి పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తాను మధ్యతరగతికి చెందిన వాడినని వాపోయారు.
ఈ నేపథ్యంలోనే తనకు ఎమ్మెల్యే నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే నివాసం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మురళీధర్ అనే ఈ వ్యాపారి సోమవారం బోధన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు బోధన్ పోలీసులు నిరాకరించడంతో గురువారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, తనకు ఎమ్మెల్యేతో ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఎప్పుడో రంజాన్ తోఫా కిట్ల డబ్బులు..
2018లో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు సరుకులతో కూడిన తోఫా కిట్ల సరఫరాకు సంబంధించి వ్యాపారి మురళీధర్‌తో ఎమ్మెల్యే షకీల్ రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.12 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.24 లక్షలు 3 నెలల్లో ఇస్తామని చెప్పారు.
కానీ ఈ డబ్బుల కోసం తాను పలుమార్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా స్పందించలేదని మురళీధర్ వాపోతున్నారు. అలాగే, 2019లో ఫుడ్ క్యాటరింగ్‌కు సంబంధించి మరో రూ.5 లక్షలు కూడా తనకు రావాలన్నారు. ఈ డబ్బుల కోసం పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్లి అడిగినా.. ఎమ్మెల్యే దాటవేశారని తెలిపారు. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో, ఎమ్మెల్యే స్నేహితుడికి ఫోన్ చేసి తన బాధను వెళ్లగక్కానని, స్నేహితుడి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తనతో మాట్లాడారని వ్యాపారి తెలిపారు. బూతు మాటలతో తిట్టడంతో పాటు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పారన్నారు. తాను అప్పులు తెచ్చి సరుకులు సరఫరా చేశానని, తన వద్ద డబ్బులు లేక అవి తీర్చలేదని, వడ్డీ కూడా కట్టకపోవడంతో తన షాపు వేలం వేస్తున్నారని వాపోయారు.
నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు: ఎమ్మెల్యే
తాను మురళీధర్‌కు పది పైసలు కూడా బాకీ లేనని, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని షకీల్ అమేర్ సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని చెప్పారు. అతనికి తానే లిఫ్ట్ ఇచ్చానని, ఇప్పుడు తననే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. తాను 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలను ఆదుకున్నానని, తాను బాకీ ఉన్నానని అనడం తప్పు మాట అని అమేర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment