బస్టాండ్, స్ట్రీట్ డస్ట్‌బిన్, పార్కు ఇలా అక్కడక్కడా డబ్బులు పెడుతున్న వ్యక్తులు
ఆ డబ్బుల కోసం ఎగబడుతున్న ఫాలోవర్స్.. ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్టులు..
లక్షల్లో వ్యూస్ కోసమే..
సిటీలో సరికొత్త ట్రెజర్ హంటింగ్
జనాలతో సందడిగా ఉండే ప్రాంతం అది..ఒక వ్యక్తి తొందరతొందరగా వచ్చి ఫుట్‌పాత్‌పై ఉన్న చెత్తకుండీకి అంటించి ఉన్న కవర్ తీసుకొని అందులోని 500 రూపాయల నోట్ జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు.
మనుషులే లేని మరో నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన పాతబస్టాండ్‌లోకి వేగంగా వెళ్లి ఇనుప చువ్వలో దాచిన వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్లాడు మరొకతను.
వ్యూస్, లైక్స్ కోసమేనా??
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, క్రికెట్ స్టేడియం వంటి పరిసర ప్రాంతాలతోపాటు బస్టాండ్‌లు, పార్కులు, ఫ్లైఓవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. నగరంలో న్యూ ట్రెండ్‌గా మారింది ఈ తరహా ట్రెజర్..కాదుకాదు క్యాష్ హంటింగ్. నగరంలోనే కాదు..నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో సైతం మనీ హంటింగ్ కొనసాగించడం విశేషం. కొందరు వ్యక్తులు ఇలా డబ్బులను వివిధ ప్రాంతాల్లో పెట్టి అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు.
వీటి కోసం ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వేదికగా ప్రత్యేకంగా సైట్లు, సోషల్ పేజ్‌లు తయారు చేసుకున్నారు. ఇందులోని ఫాలోవర్స్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లో అక్కడకు చేరుకొని డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. మరికొందరు యాక్సెసరీస్ ప్యాక్ చేసి పెట్టి వారి స్టోర్ లేదా బ్రాండ్‌లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సోషల్ మీడియా అకౌంట్లకు పెద్దఎత్తున ఫాలోవర్స్ ఉండటం విశేషం.
సోషల్‌మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్‌ను ఆకర్షించడం, వ్యూస్, లైక్స్ సంఖ్య పెంచుకోవడానికి ఈ తరహా ట్రెజర్ హంటింగ్ నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సోషల్‌మీడియాలో ఫేమ్‌తో పాటు యాడ్స్ రూపంలో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు హంట్ వీడియో పెడతారా అని ఫాలోవర్స్ చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఎవరు ముందు వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారనేది కూడా వీడియో తీసి అదే సోషల్ సైట్లలో పెడుతుంటే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment