తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ డ్యాన్స్ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
(చదవండి : బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?)
అయితే ఆమె డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్. రచయిత లక్ష్మణ్ సాహిత్యానికి ఎస్‌కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్‌లో మాట్లాడారు. (చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు)
‘మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే క్యాస్ట్‌గా (నటించడం) చేయాలి’ అని చెప్పగా సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. దీంతో సాయిశ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. రాహుల్ సిప్లిగంజ్, నోయల్‌తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment