సాక్షి, హైదరాబాద్: రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు కూడా ఇప్పటివరకు పాటిస్తున్న జాగ్రత్తలను కొనసాగిస్తే చాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మంగళవారం స్పష్టం చేసింది. ‘వీయూఐ 202012/1’ లేదా బీ.1.1.7 అని పిలుస్తున్న ఈ రూపాంతరిత వైరస్ యూరోపియన్ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీసీఎంబీ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇప్పటివరకు పాటిస్తున్న జాగ్రత్తలు అంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం చాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరస్ జన్యుక్రమంపై విస్తృతస్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని, ఎంతమేరకు వ్యాప్తి చెందిందన్నది తెలుసుకునేందుకు ఇది కీలకమని చెప్పారు. (చదవండి: ఆరుగురికి ‘యూకే’ వైరస్)
ఇక బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన సుమారు 33 వేల మందిని గుర్తించి, పరీక్షించడం ద్వారా ఈ కొత్త రకం వైరస్ ఇక్కడ కూడా ఉందని తెలిసిందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపతి తెలిపారు. ఈ వైరస్‌లో మొత్తం 17 జన్యుమార్పులుండగా, ఎనిమిదింటి ప్రభావం దాని కొమ్ముపై ఉంటుందన్నారు. అత్యాధునిక జీన్ సీక్వెన్సింగ్ పరికరాల సాయంతో వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించామని వివరించారు. ఈ మార్పులు వ్యాధి తీవ్రతను, లక్షణాలను ఎక్కువ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ కొత్త రకం వైరస్ అడ్డు కాబోదని స్పష్టం చేశారు. వైరస్ గుర్తింపు పరీక్షలోనూ ఎలాంటి మార్పు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment